హడావేడి ఏమైందో! | - | Sakshi
Sakshi News home page

హడావేడి ఏమైందో!

Feb 11 2026 7:24 AM | Updated on Feb 11 2026 7:24 AM

హడావే

హడావేడి ఏమైందో!

ఉన్నతాధికారులకు నివేదించాం

విశ్వసనీయ సమాచారం మేరకు కడియం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాం. ఈ తనిఖీల్లో 911 డాక్యుమెంట్లను తక్కువ వాల్యూకు రిజిస్టర్‌ చేసినట్లు గుర్తించాం. సబ్‌ రిజిస్ట్రార్‌ లక్ష్మి టేబుల్‌ సొరుగులో రూ.79 వేలు, సమీప లేఖర్ల నుంచి రూ.1.32 లక్షలు స్వాధీనం చేసుకున్నాం. దీనిపై నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు తెలియజేశాం, వారి ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయి.

– ఎం.కిశోర్‌ కుమార్‌, డీఎస్పీ,

ఏసీబీ, రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరం రూరల్‌: అవినీతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) దాడులు చేస్తుంది. అలాగే ఆదాయానికి మించిన ఆస్తులున్న వారిపై కూడా నిఘా పెడుతుంది. అవినీతి జరుగుతున్నట్టు ఫిర్యాదు వచ్చిన వెంటనే తనిఖీలు నిర్వహించి, సమగ్రంగా విచారణ జరిపి, అక్రమార్కులను అరెస్టు చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, కడియం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఇటీవల జరిగిన దాడి వ్యవహారం మాత్రం దీనికి భిన్నంగా కనిపిస్తోంది. ఈ దాడి తర్వాత అంతా గప్‌చుప్‌గా మారింది. తనిఖీ చేసిన ఏసీబీ అధికారులు తదుపరి చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తామంటూ వెళ్లిపోయారు. దాదాపు 12 రోజులు దాటినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి చక్రం తిప్పడం వల్లనే అధికారులు సైలెంట్‌ అయ్యిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వివరాలివీ..

కడియం సబ్‌ రిజిస్ట్రార్‌ ఎప్పిలి లక్ష్మి విధుల్లో ఉండగా గత నెల 29వ తేదీన ఏసీబీ డీఎస్పీ కిశోర్‌ కుమార్‌ ఆధ్వర్యంలోని బృందం ఆకస్మిక తనిఖీలు చేసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ తనిఖీల్లో సుమారు 911 డాక్యుమెంట్లను తక్కువ విలువకు రిజిస్టర్‌ చేసినట్లు గుర్తించామని ఏసీబీ అధికారులు ప్రకటించారు. అలాగే సబ్‌ రిజిస్ట్రార్‌ టేబుల్‌ సొరుగులో రూ.79 వేలు, సమీప లేఖర్ల నుంచి రూ.1.32 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సబ్‌ రిజిస్ట్రార్‌, కార్యాలయం సిబ్బంది, లేఖర్ల నుంచి ఏసీబీ అధికారులు ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో వారు వేరే నంబర్లతో తమ కార్యకలాపాలను ఎప్పటి మాదిరిగానే చేస్తున్నారని కక్షిదారులు చెబుతున్నారు. తనిఖీల అనంతరం తదుపరి చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తామంటూ ఏసీబీ అధికారులు వెళ్లిపోయారు. అప్పట్నుంచి అంటే దాదాపు పది రోజులుగా లక్ష్మి, సిబ్బంది యథాతథంగా కార్యాలయానికి వచ్చి విధులు నిర్వహిస్తున్నారు.

చర్యల్లేనట్టేనా..

అదనంగా డబ్బులు కలిగి ఉండడం, తక్కువ విలువకు డాక్యుమెంట్లను రిజిస్టర్‌ చేయడం ద్వారా సుమారు రూ.2.62 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించినట్లుగా ఏసీబీ అధికారులు తమ విచారణలో నిర్ధారించారు. అయినప్పటికీ, దీనికి బాధ్యులైన వారిపై ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలోనే పలువురు బాధితులు రిజిస్ట్రార్‌ కార్యాలయానికి క్యూ కట్టారు. అయితే సంబంధిత అధికారులు వారిని పరిగణనలోకి తీసుకున్న దాఖలాల్లేవని తెలుస్తోంది. గతంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ నేరుగా విచారణ జరిపి పలు అవకతవకలను వెలికి తీశారు. ఆ తరువాత ఏసీబీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. గతంలో రిజిస్ట్రేషన్ల శాఖాధికారులు తేల్చిన అవకతవకలనే వారు మరోమారు మీడియాకు వెల్లడించారు. అదనంగా డబ్బులు, సెల్‌ఫోన్లను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఈ తతంగమంతా ఆయా శాఖల విధి నిర్వహణలో భాగంగానే జరిగిందా? లేక ఎవరి ప్రయోజనాల కోసమైనా చేశారా అనే అనుమానాలూ లేకపోలేదు.

మాజీ మంత్రి దన్ను

ఈ కేసు గప్‌చుప్‌గా మారడం వెనుక టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత ఉన్నతాధికారులతో ఆయనే నేరుగా మాట్లాడారని, ఈ నేపథ్యంలోనే విచారణ అనంతరం చర్యలు తీసుకోవడంలో కాలయాపన జరుగుతోందని చెబుతున్నారు. వీలైనంత కాలయాపన అనంతరం గుట్టుచప్పుడు కాకుండా నామమాత్రపు పెనాల్టీతో సరిపెట్టేస్తారని అంటున్నారు. అలా కాకపోతే ఎవరో ఒకరిని బలి చేసి అసలు వ్యక్తులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ మరో ప్రచారం కూడా జోరందుకుంది. దీంతో కడియం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఉద్యోగుల్లో అలజడి నెలకొంది. రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారుల విచారణలో ఏం తేలింది? ఎవరైనా తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యమవుతోందనే ప్రశ్నలకు అటు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారుల నుంచి గానీ, ఇటు ఏసీబీ అధికారుల నుంచి గానీ కచ్చితమైన సమాధానం లభించడం లేదు.

కడియం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఇటీవల ఏసీబీ తనిఖీలు

అవకతవకలు గుర్తించినట్టు వెల్లడి

దాడుల అనంతరం అంతా గప్‌చుప్‌

యథావిధిగా

కొనసాగుతున్న సబ్‌ రిజిస్ట్రార్‌, సిబ్బంది

హడావేడి ఏమైందో! 1
1/1

హడావేడి ఏమైందో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement