మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి
రాజమహేంద్రవరం రూరల్: మహిళలు, బాలికలపై జరిగే నేరాలతో పాటూ మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. ఆయన మంగళవారం సాయంత్రం బొమ్మూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌లోని పలు రికార్డులను, సీసీ కెమెరాలను పరిశీలించి, నమోదైన కేసులపై ఆరా తీశారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఇన్‌స్పెక్టర్ కాశీవిశ్వనాథం, ఎస్సైలకు సూచించారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా, యాంటీ డ్రగ్స్, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పోలీసింగ్‌లో టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించాలన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను ఆయనకు ఎస్పీ డి.నరసింహ కిశోర్ వివరించారు. ముందుగా బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో నూతన భవనాన్ని ప్రారంభించి, మొక్కలు నాటారు. కార్యక్రమంలో సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్, ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్య తదితరులు పాల్గొన్నారు.
మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి


