13, 14, 15 తేదీల్లో శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు
అమలాపురం రూరల్: మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి శ్రీశైలం ఆలయానికి ప్రత్యేక బస్సులు నడుపుతామని డీఎం డీఎల్‌ఎన్ శర్మ తెలిపారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఉదయం 9.30, సాయంత్రం 5.30, 6.15, 6.45, రాత్రి 7 గంటలకు ఈ సర్వీసులు నడుస్తాయన్నారు. ఈ బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం ఉందని, ప్రయాణికులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అలాగే 15, 16 తేదీల్లో ఉదయం 5 నుంచి రాత్రి 7 వరకూ ప్రతి గంటకూ కుండలేశ్వరానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామన్నారు.
భర్త అనుమానం..
మహిళ ఆత్మహత్య
రాయవరం: అనుమానంతో భార్యను వేధించి, ఆమె ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు మంగళవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. రాయవరం మండలం సోమేశ్వరం గ్రామంలో పాకలపాటి వీర వెంకట లక్ష్మీదుర్గ ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతుందనే అనుమానంతో భర్త మహేష్ తరచూ గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కూడా ఆమెతో గొడవపడి, సెల్‌ఫోన్ లాక్కున్నాడు. మనస్తాపానికి గురైన లక్ష్మీదుర్గ మంగళవారం ఉదయం 6 గంటలకు ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో నిందితుడు మహేష్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.
అన్నవరంలో సిబ్బందికి
అంతర్గత బదిలీలు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్ నుంచి రికార్డు అసిస్టెంట్, రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వరకూ 68 మందికి అంతర్గత బదిలీలు నిర్వహిస్తూ దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రసాదం విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పి.లక్ష్మీనారాయణను నిత్య పూజలు, కల్యాణాల విభాగానికి బదిలీ చేశారు. అతడి స్థానంలో కేశఽఖండన శాలలో పనిచేస్తున్న చిక్కాల సాయిబాబాను నియమించారు. అన్నదానం స్టోర్స్ గుమస్తాగా పనిచేస్తున్న బండారు వెంకట రమణను ప్రసాదం విభాగంలో నియమించారు. వ్రతాల విభాగం సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వెలగా రమేష్ కుమార్‌ను రిసెప్షన్‌కు మార్చారు. ఆయన స్థానంలో అన్నదానంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కంచిభట్ల రాంబాబును నియమించారు. ఇంకా మిగిలిన ఉద్యోగులను కూడా వారి స్థానాల నుంచి ఇతర విభాగాలకు మార్చారు.


