కంచి కామకోటి విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఆహ్వానం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కంచి కామకోటి విద్యాసంస్థల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఆ విద్యాలయాల చీఫ్ కో ఆర్డినేటర్ మాంధాత మాధవి అన్నారు. జయేంద్ర నగర్ వినాయకుని ఆలయంలో మంగళవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఉపనయనమైన బ్రాహ్మణులకు విద్య, వేదం, వైద్యంతో పాటు ఇంగ్లిషు, స్మార్తం, ఆగమనం, సంగీతం, రామాయణం వంటి వాటిలో ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. నాయీ బ్రాహ్మణులకు నాదస్వరం, మంత్రసాని, నర్సింగ్, యాదవులకు గోవిజ్ఞానం, కుమ్మరులకు కుంభాకార విద్య, విశ్వ బ్రాహ్మణులకు తక్ష విద్యతో పాటు ఆంగ్ల విద్యను బోధిస్తామని తెలిపారు. బ్రాహ్మణ ఆడపిల్లలకు సంప్రదాయ విద్య, మడి ఆచారం, ఇంగ్లిషు నేర్పిస్తామన్నారు. తమ విద్యా సంస్థలు తిరుపతిలో ప్రారంభమై దేశ వ్యాప్తంగా పదిచోట్ల ఉన్నాయని చెప్పారు. కాకినాడలోని సూర్యకళా మందిరంలో ఈ నెల 21 ఉదయం 9 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. కాంచీపురంలోని కంచి చంద్రశేఖర సరస్వతి మహా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్, పారామెడికల్, ఆయుర్వేదం, లా, నర్సింగ్ వంటి కోర్సులకు 2026 – 27 సంవత్సరానికి మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. వారికి వచ్చిన మార్కులను బట్టి స్కాలర్‌షిప్ సదుపాయం కూడా ఉందన్నారు. తమ విద్యాసంస్థల్లో వార్డెన్లు, వంటవారి ఉద్యోగాలు ఉన్నాయని, ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని మాధవి తెలిపారు. సమావేశంలో ఆకలి మురళీకృష్ణ, మాంధాత సూర్యారావు, మాంధాత స్వర్ణ పాల్గొన్నారు.
స్కూల్ బస్సులపై కేసులు
రావులపాలెం: నిబంధనలు పాటించని రెండు స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేసి రూ.10,200 అపరాధ రుసుము విధించినట్టు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. స్కూల్ బస్సులపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. ఓవర్ లోడింగ్, అతివేగం, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై దృష్టి సారించామన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.


