రత్నగిరి.. భక్తజన ఝరి | - | Sakshi
Sakshi News home page

రత్నగిరి.. భక్తజన ఝరి

Feb 8 2026 4:15 AM | Updated on Feb 8 2026 4:15 AM

రత్నగిరి.. భక్తజన ఝరి

రత్నగిరి.. భక్తజన ఝరి

సత్యదేవుని దర్శించిన 30 వేల మంది

స్వామివారి ఆదాయం రూ.30 లక్షలు

రెండు వేల వ్రతాల నిర్వహణ

అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారి సన్నిధికి విచ్చేయడంతో క్యూ లు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి ప్రదక్షిణ చేశారు. సర్క్యులర్‌ మండపం వద్ద సుమారు ఐదు వేల మంది భక్తులకు పులిహోర, దద్దోజనం పంచిపెట్టారు. దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు ఆలయ ప్రాంగణం, ప్రసాదం విభాగం, అన్నదానం, వ్రతాలు తదితర ఏర్పాట్లు పర్యవేక్షించారు. భక్తులు రెండు వేల సత్యదేవుని వ్రతాలు ఆచరించారు.

దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం

శనివారం విచ్చేసిన భక్తుల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షలు ఆదాయం సమకూరింది. ఒక్క వ్రతాల విభాగం ద్వారానే దేవస్థానానికి రూ.15 లక్షల ఆదాయం సమకూరింది. మరో రూ.15 లక్షలు ప్రసాదాల విక్రయాలు, ఇతర విభాగాల ద్వారా వచ్చింది.

ఘనంగా సత్యదేవుని ప్రాకార సేవ

సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని శనివారం ఆలయ ప్రాకారంలో తిరుచ్చి వాహనంపై ఊరేగించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తూర్పురాజగోపురం వద్దకు తీసుకువచ్చి తిరుచ్చిపై ప్రతిష్ఠించారు. అనంతరం అర్చకులు దత్తు శర్మ, పరిచారకుడు ఇంద్రగంటి రాజా స్వామి, అమ్మవార్లకు పూజలు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛాటన మధ్య, మంగళవాయిద్యాల నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రాగా, స్వామి, అమ్మవార్లను మూడుసార్లు ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఊరేగింపు అనంతరం స్వామి, అమ్మవార్లకు మళ్లీ పూజలు చేసి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. నివేదన చేశారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement