అమ్మో పులి
ఫ మెట్ట ప్రజలను వణికిస్తున్న వైనం
ఫ అటవీ ప్రాంతంలో
జల్లెడ పడుతున్న అధికారులు
దేవరపల్లి: మెట్ట ప్రాంత ప్రజలను పులి వణికిస్తోంది. రెండు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భీమోలు గ్రామంలోని పంట పొలాల్లో శుక్రవారం ఓ పులి, రెండు పిల్లలతో తిరుగుతున్నట్లు చూసినట్లు రైతు కె.రామకృష్ణ చెబుతున్నారు. గ్రామస్తుల సమాచారంతో అటవీ అధికారులు రంగలోకి దిగారు. పులి సంచరిస్తున్నట్టు రైతు చెప్పిన ప్రాంతంలో రెండు రోజులుగా అధికారులు గాలిస్తున్నారు. అటవీ ప్రాంతంలో జంతువు పాదముద్రను గుర్తించారు. అయితే అది పులి పాద ముద్రా? లేక ఏదైనా జంతువుదా అనేది నిర్ధారించాల్సి ఉంది. ఆదివారం జిల్లా అటవీ అధికారి దావీద్‌రాజు నాయుడు, డిప్యూటీ రేంజ్ అధికారి జి.వేణుగోపాల్, సిబ్బంది అటవీ ప్రాంతంలో పర్యటించారు. ఆరు ప్రదేశాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు దావీద్‌రాజు నాయుడు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా ఎవరూ పొలాలకు వెళ్లవద్దని సూచించారు.
గతేడాదీ ఇదే పరిస్థితి..
గత ఏడాది కూడా గోపాలపురం నియోజకవర్గంలో ప్రజలకు దాదాపు రెండు నెలలు పులి కంటి మీద కునుకు లేకుండా చేసింది. 2024 ఫిబ్రవరిలో ద్వారకాతిరుమల మండలంలో కొద్ది రోజులు సంచరించిన పులి నల్లజర్ల, దేవరపల్లి మండలాల్లోని పొగాకు తోటల్లోనూ తిరిగింది. రెండు మండలాల్లో పులి తెల్లవారు జామున పొలాలకు వెళ్లిన రైతుల కంట పడడంతో భయంతో వణికిపోయారు. దాని ఆచూకీ కోసం అటవీ అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. పొలాల్లో పాదముద్రలను సేకరించి పులి సంచరిస్తున్నట్టు నిర్ధారించారు. ఫిబ్రవరి 3న పులి దేవరపల్లి మండలం యాదవోలు నుంచి గోపాలపురం మండలం వాదాలకుంట, కోమటికుంట, కరిచర్లగూడెం గ్రామాల మీదుగా మాతగమ్మ మెట్టపైకి చేరుకుని సంచరించింది. అక్కడ నుంచి గోపాలపురం మండలం కరగపాడు గ్రామ శివారున గల రిజర్వ్ ఫారెస్ట్‌కు చేరుకుంది. ఫారెస్ట్‌కు సమీపంలో కరగపాడుకు ఆనుకుని ఉన్న రైతు జక్కు అచ్చయ్య మొక్కజొన్న తోటలో పెంచుకుంటున్న పందిపై పులి దాడి చేసింది. ఆ పులి ఆచూకీ కోసం రిజర్వ్ ఫారెస్ట్‌లో పలు ప్రదేశాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. మళ్లీ ఇప్పుడు పులి జాడలు కనిపించడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
అమ్మో పులి


