అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలి
రాజానగరం: సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనకు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.విజయ భాస్కరరావు అన్నారు. అమరావతిలోని ఏపీ స్పేస్ అకాడమీ (ఏపీఎస్‌ఏ), ఆదికవి నన్నయ యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ, కమ్యూనికేషన్ (ఏఎస్‌టీసీ) సహకారంతో ‘విశ్వంపై జిజ్ఞాసను పెంపొందించడం – అంతరిక్ష సంస్కృతికి ఉత్ప్రేరకం’ అనే అంశంపై వర్సిటీ ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా విజయ భాస్కరరావు మాట్లాడుతూ, రానున్న 25 ఏళ్లలో దేశ వనరులు, సవాళ్లు, భూమిపై రిమోట్ సెన్సింగ్ సామర్థ్యాలను వివరించారు. వైస్ చాన్సలర్ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ మాట్లాడుతూ, కొత్త ఆలోచనలను అన్వేషించే వేదికను యువ అభ్యాసకులకు అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. స్సేస్ అకాడమీ ఉపాధ్యక్షుడు, ఇస్రో అసోసియేట్ డైరెక్టర్ వి.శేషగిరిరావు మాట్లాడుతూ, స్పేస్ టెక్నాలజీలో విద్యార్థులకు ఎన్నో అవకాశాలున్నాయని చెప్పారు. ఏపీ స్పేస్ అకాడమీ కార్యనిర్వాహక కార్యదర్శి కేవీ రమణ, రిజిస్ట్రార్ కేవీ స్వామి, ప్రిన్సిపాల్ పి.విజయనిర్మల, కో ఆర్డినేటర్ ఎస్.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.


