నమ్మకం.. నిజాయతీలదే విజయం
కపిలేశ్వరపురం: స్థానిక ఎంపీపీగా తాతపూడి ఎంపీటీసీ సభ్యురాలు జిత్తుక వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు గురువారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎన్నిక నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి పర్యవేక్షణలో ఎన్నికల అధికారి వి.విజయలక్ష్మి ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. వైఎస్సార్ సీపీకి చెందిన 12 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరుకాగా, టీడీపీ, జనసేన, వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీకి మారిన ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. కోరంకు సరిపడ 10 మందికి మించి సభ్యులు ఉండడంతో ఎన్నిక నిర్వహించారు. ఎంపీపీ స్థానానికి వెంకటలక్ష్మిని కేదారిలంక ఎంపీటీసీ సభ్యుడు యర్రంశెట్టి నాగేశ్వరరావు ప్రతిపాదించగా నేలటూరు ఎంపీటీసీ సభ్యురాలు రుద్రాక్షుల వీరగౌరీ కుమారి బలపరిచారు. దీంతో వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా గెలుపొందినట్టు జేసీ నిషాంతి, ఎన్నికల అధికారి వి.విజయలక్ష్మి ధ్రువీకరణ పత్రం అందజేశారు. నూతన ఎంపీపీ వెంకటలక్ష్మికి ఎంపీడీఓ హెచ్.భానోజీరావు, ఎంపీడీఓ కార్యాలయ ఏఓ జి.రాజేంద్రప్రసాద్, సిబ్బంది, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, సహచరులు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రలోభాలకు లొంగక..
రాజకీయాల్లో ఒడిదొడుకులు సహజం. ప్రజా జీవితంలోకి వచ్చాక వ్యక్తిగత ఇష్టాలు, ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలే మిన్న అంటూ జీవించాల్సి ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో ప్రలోభాలకు లొంగకుండా గెలుపు అవకాశాన్ని ఇచ్చిన పార్టీ బాటలో నడచి, చేయిపట్టి నడిపించిన నాయకుడి నమ్మకాన్ని నిలబెట్టాల్సి ఉంటుంది. మండల పరిషత్ ఎన్నికల్లో అదే జరిగింది. వైఎస్సార్ సీపీకి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నమ్మకానికి 12 మంది ఎంపీటీసీ సభ్యులు కట్టుబడి నిలబడ్డారు. దీంతో టీడీపీ ఎంపీటీసీ సభ్యులు, వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి మళ్లిన ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. అంతిమంగా నిజాయతీ మరోసారి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకుంది. మండలంలో 19 మంది ఎంపీటీసీ స్థానాలుండగా గత పరిషత్ ఎన్నికల్లో 15 వైఎస్సార్ సీపీ, రెండు టీడీపీ, మరో రెండు జనసేన గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు ప్రలోభాలకు లొంగినప్పటికీ మిగిలిన 12 మంది నిజాయతీగా నిలిచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించారు. ఓటింగ్‌లో ఎంపీపీ జిత్తుక వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు రుద్రాక్షుల వీరగౌరీ కుమారి, పెందుర్తి శిరీష, పలివెల మధు, గుణ్ణం భాను ప్రసాద్, అడ్డాల శ్రీనివాస్, మేడిశెట్టి దుర్గారావు, మేడిశెట్టి సత్యవేణి, ఉమ్మిడిశెట్టి వీరవేణి, గొల్లపల్లి సోనియా, యర్రంశెట్టి నాగేశ్వరరావు, సాకా శ్రీనివాస్ పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
తనతో సహా వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులంతా గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మండల పరిషత్‌లో ఉన్న సుమారు 70 లక్షల నిధులను మండలంలోని 19 గ్రామాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే తీర్మానాలు చేశాం. వివిధ దశల్లో ఎమ్మెల్యే వేగుళ్ల ప్రోద్బలంతో అవన్నీ నిలిచిపోయాయి. ఇప్పటికీ తామంతా పరిషత్ నిధులను పార్టీలకు అతీతంగా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
– జిత్తుక వెంకటలక్ష్మి, ఎంపీపీ
సభ్యులకు కృతజ్ఞతలు:
ఎమ్మెల్సీ తోట
కపిలేశ్వరపురం ఎంపీపీ ఎన్నికలో నిజాయతీగా నిలబడిన వైఎస్సార్ సీపీకి చెందిన 12 మంది ఎంపీటీసీ సభ్యులను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అభినందించారు. అప్పట్లో రెండున్నరేళ్ల తర్వాత మరో బీసీ మహిళకు అవకాశం ఇవ్వాలని సభ్యులు ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరగడం, టీడీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించడం, సభ్యులను ప్రలోభాలకు గురి చేయడం తదితర కారణాలతో వారు కుదుర్చుకున్న ఒప్పందం అమలు ఆలస్యమైందన్నారు. ఒప్పందానికి కట్టుబడి మేడిశెట్టి సత్యవేణి రాజీనామా చేయడం, జిత్తుక వెంకటలక్ష్మి ఎన్నికకు 12 మంది సభ్యులు ఏకతాటిపై నిలవడం వైఎస్సార్ సీపీ పట్ల, తన పట్ల ఎంపీటీసీ సభ్యులకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందన్నారు. 2024లో చంద్రబాబు సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన కొద్ది రోజులు తర్వాత మాట్లాడుతూ ఇతర పార్టీల వారిని టీడీపీలోకి చేర్చుకోబోమని, ఎవరైనా రాదలిస్తే తమ పదవులకు రాజీనామా చేసి చేరవచ్చని ప్రగల్బాలు పలికారన్నారు. రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీకి చెందిన కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులను టీడీపీలోకి చేర్చుకున్నారని, వారంతా వారి వారి పదవులకు రాజీనామా చేయించి చేర్చుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేని నేత అని ఆయన చంద్రబాబు తీరును ఎద్దేవా చేశారు. మండపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేగుళ్ల తీరు సైతం అలానే ఉందన్నారు. నియోజకవర్గంలో పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లను ఎమ్మెల్యే వేగుళ్ల ప్రలోభాలకు గురి చేస్తూ నిస్సిగ్గుగా టీడీపీలో చేర్చుకున్నారన్నారు. అధికారం శాశ్వతం కాదని, నిజాయతీ, అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్యే వేగుళ్ల తెలుసుకోవాలని ఎమ్మెల్సీ తోట అన్నారు.
కపిలేశ్వరపురం ఎంపీపీగా
విజయలక్ష్మి ఏకగ్రీవం
అండగా నిలచిన 12 మంది
వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు
ప్రలోభాలకు లొంగని వైనం
కృతజ్ఞతలు తెలిపిన తోట త్రిమూర్తులు
ఎన్నికను పర్యవేక్షించిన జేసీ నిశాంతి


