కొండలను కొల్లగొట్టి కాసుల పంట
గోపాలపురం: మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. సంపాదనే ధ్యేయంగా కొందరు దళారులు మండలంలోని పోలవరం కుడి ప్రధాన కాలువ, తాడిపూడి, చింతలపూడి కాలువ గట్లు కొల్లగొట్టి మట్టి అక్రమంగా తవ్వేస్తున్నారు. గోపాలపురం మండలం గుడ్డిగూడెం, కొవ్వూరుపాడు, గోపాలపురం, చిట్యాల, చెరుకుమిల్లి, రాజంపాలెం, గంగోలు, యర్రవరం గ్రామాలలో ఉన్న పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి సుమారు 70 శాతం మట్టిని అక్రమంగా తరలించి సొమ్ముచేసుకున్నారు. వారికి స్థానిక నాయకుల అండదండలు ఉండడంతో జేసీబీలతో రేయింబవళ్లు తవ్వేస్తున్నారు. తాడిపూడి, చింతలపూడి కాలువ గట్లు ఇప్పటికే మాయమైపోయాయి. కాలువ తవ్వకాల సమయంలో రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం పొందిన రైతులు మిగులు భూములపై కన్నేసి ఆ భూమిలోని మట్టిని విక్రయించి చదును చేసి పంటలు సాగు చేస్తున్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రభుత్వం సేకరించిన భూమిని ఎటువంటి ఆధారాలు లేకుండా మళ్లీ సాగులోకి తెస్తున్నారు. కొవ్వూరుపాడు, గోపాలపురం, గుడ్డిగూడెం గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ కొండలను సైతం అక్రమార్కులు తవ్వేసి ఇళ్లకు, ఎత్తు పల్లాల నేలల చదునుకు మట్టిని విక్రయిస్తున్నారు.
కొండలు పిండి చేస్తున్నారు
రాత్రీపగలు తేడా లేకుండా మట్టిని తరలిస్తూ కొండలను పిండి చేస్తున్నారు. మట్టి ట్రాక్టర్ ఇంటి వద్ద వేయాలంటే దూరాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి రూ. 1500కు విక్రయిస్తున్నారు. భవిష్యత్తులో మట్టి దొకడం కష్టంగా ఉంటుంది. కొండలు పిండి చేస్తున్నా సంబంధిత ఇరిగేషన్ అధికారులు కానీ, రెవెన్యూ అఽధికారులు కానీ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలను నిలిపివేయాలి.
– సరంగి మోసియ్య, చిట్యాల
ఆగని మట్టి అక్రమ తవ్వకాలు
చోద్యం చూస్తున్న అధికారులు
స్థానిక నాయకుల అండతో
రేయింబవళ్లు మట్టి తరలింపు
గోపాలపురం మండలంలో విడ్డూరం
కొండలను కొల్లగొట్టి కాసుల పంట


