ప్రైవేటీకరణపై ప్రజాగ్రహం
కాకినాడ సిటీ కార్యాలయం నుంచి వెళ్తున్న
ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, విప్పర్తి వేణుగోపాలరావు
కిర్లంపూడిలో పార్టీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం,
ప్రత్తిపాడు కో–ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, శివకుమారి తదితరులు
వైద్య కళాశాలల అంశంపై
ప్రజల్లో పెల్లుబికిన అసంతృప్తి
వర్గాలకు అతీతంగా సంతకాలు
నియోజకవర్గాల నుంచి వైఎస్సార్ సీపీ జిల్లా కేంద్ర కార్యాలయానికి ప్రతులు
జాతరలా తరలి వచ్చిన
పార్టీ నాయకులు, శ్రేణులు
‘బాబు’ ప్రైవేటు జపంపై నీళ్లు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రభుత్వ రంగంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన వైద్య కళాశాలలను ప్రైవేటీకరించే చంద్రబాబు సర్కార్ కుట్రలపై ప్రజాగ్రహం పెల్లుబికింది. వారి ఆగ్రహాన్ని సంతకాల రూపంలో బాక్సుల్లో భద్రపరచారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుతో కాకినాడ జిల్లాలో పార్టీ శ్రేణులన్నీ ఒక్కతాటిపైకి వచ్చి సుమారు 40 రోజుల పాటు జరిపిన అవిశ్రాంత కృషి బుధవారం నాటికి ఫలించింది. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో విభిన్న వర్గాల ప్రజలు నాలుగు లక్షల పై చిలుకు సంతకాలతో ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాన్ని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో నూరుశాతం పూర్తి చేశారు.
జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో సేకరించిన సంతకాల ప్రతులను కట్టలుగా కట్టి ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి ప్రత్యేక వాహనాల్లో పార్టీ కో ఆర్డినేటర్లు దగ్గరుండి కాకినాడ పైడావారి వీధిలో పార్టీ జిల్లా కార్యాలయానికి బుధవారం పంపించారు. ఈ ప్రక్రియను నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు ఒక పండుగ వాతావరణంలో పూర్తి చేయడం పార్టీకి మంచి ఊపునిచ్చింది. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రజల నుంచి సేకరించిన సంతకాల పత్రాలను బాక్సుల్లో భద్రంగా ఉంచి పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యాన గవర్నర్‌కు అందచేసేందుకు సిద్ధం చేశారు. జిల్లాలో సుమారు నాలుగు లక్షల సంతకాలతో కూడిన పత్రాలను ఏడు నియోజకవర్గాల నుంచి కాకినాడ పార్టీ కార్యాలయంలో భద్రపరిచారు. ఐదారు వారాలుగా ప్రజల మద్దతుతో సేకరించిన సంతకాల ప్రతుల బాక్సులను దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలతో, కొన్ని నియోజకవర్గాల్లో సెంటిమెంట్‌కు తగ్గట్టు పూజలుచేసి జిల్లా కేంద్రానికి తరలించారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో సెంటిమెంట్‌గా కోటనందూరు మండలం తాటిపాక నుంచి సంతకాల ప్రతుల తరలింపు ప్రారంభించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలతో మోటార్ సైకిల్ ర్యాలీ ఉరకలెత్తింది. దాడిశెట్టి రాజా బుల్లెట్‌పై ముందు వరుసలో ఉండి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. తాటిపాక నుంచి తొండంగి మీదుగా కాకినాడకు చేరుకుని సంతకాల ప్రతుల బాక్సులను పార్టీ జిల్లా కార్యాలయానికి అందజేశారు.
పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి, రూరల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ రూరల్, కరప మండలాలతో పాటు సిటీలోని 8 డివిజన్ల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమీకరించిన సంతకాల ప్రతులను వెంటబెట్టుకుని పెద్ద సంఖ్యలో తరలి వెళ్లే మార్గం పార్టీ జెండాలతో కోలాహలంగా మారింది. జనసందోహంతో జాతరను తలపించింది. కాకినాడ 2వ డివిజన్ పరిధిలోని రమణయ్యపేట వైద్యనగర్‌లోని రూరల్ పార్టీ కార్యాలయం వద్ద సంతకాలు పత్రాల వాహన ర్యాలీని కన్నబాబు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన బుల్లెట్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. వైద్యనగర్, సర్పవరం జంక్షన్, బోట్‌క్లబ్, నాగమల్లితోట మీదుగా జిల్లా పార్టీ కార్యాలయానికి సంతకాలు పత్రాలు తరలించారు. ఎస్‌ఈసీ సభ్యుడు బెజవాడ సత్యనారాయణ, గోపిశెట్టి బాబ్జీ, జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, మహిళా ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి తదితరులు వెంట ఉన్నారు.
ప్రజలు వ్యతిరేకిస్తున్న వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు నగరంలో కోటి సంతకాల ఉద్యమం విజయవంతం కావడంతో రెట్టించిన ఉత్సాహంతో పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలిరాగా సంతకాల ప్రతులతో కూడిన బాక్సులతో బయలుదేరిన వాహనాన్ని సిటీ కార్యాలయం వద్ద ద్వారంపూడి, పరిశీలకుడు, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు జెండా ఊపి ప్రారంభించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి టూటౌన్ బ్రిడ్జి, భానుగుడి సెంటర్ మీదుగా పైడావారి వీధిలో జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ద్వారంపూడి, విప్పర్తి మాట్లాడుతూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ఎంతో ప్రజాదరణ లభించిందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, జిల్లా యువత అధ్యక్షులు రాగిరెడ్డి బన్ని, జిల్లా బీసీసెల్ అధ్యక్షులు అల్లి రాజబాబు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జగ్గంపేట నియోజకవర్గంలో సేకరించిన సంతకాల ప్రతులు కలిగిన బాక్సులతో కూడిన వాహనాన్ని మాజీ మంత్రి, పార్టీ కో ఆర్డినేటర్ తోట నరసింహం జెండా ఊపి ప్రారంభించారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ కాకినాడకు చేరుకుంది. పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తోట శ్రీరామ్, పార్టీ పరిశీలకుడు కొప్పన శివ, పార్టీ నేతలు రామకుర్తి జగాల్, రావుల గణేష్‌రాజా తదితరులు పాల్గొన్నారు.
పిఠాపురం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పార్టీ కోఆర్డినేటర్, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగా గీత ఆధ్వర్యంలో సంతకాల ప్రతులను 50 బాక్సులలో భద్రపరిచారు. ప్రత్యేక వాహనాన్ని గీత జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి పిఠాపురం పార్టీ కార్యాలయం నుంచి కోటగుమ్మం సెంటర్, ఉప్పాడ సెంటర్, ప్రభుత్వ ఆస్పత్రి వరకు గీత ముందు వరుసలో ఉండి నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీలో పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. అక్కడి నుంచి సంతకాల ప్రతులను పార్టీ కాకినాడ జిల్లా కార్యాలయానికి తరలించారు. గండేపల్లి బాబి, తలిశెట్టి వెంకటేశ్వరరావు, మొగిలి అయ్యారావు తదితరులు పాల్గొన్నారు.
పెద్దాపురం నియోజకవర్గంలో సంతకాల ప్రతులతో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రకు నియోజకవర్గంలో విశేష స్పందన లభించింది. సంతకాల ప్రతులతో కూడిన వాహనాలకు దొరబాబు సెంటిమెంట్‌గా భావించే తిరుపతి శృంగార వల్లభ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అక్కడి నుంచి కాండ్రకోట వరకు పాదయాత్ర జరిపారు. సంతకాల ప్రతులతో కూడిన వాహనానికి ఆయన జెండా ఊపి ప్రారంభించి కాకినాడకు తరలించారు. కార్యక్రమంలో పరిశీలకులు వాసిరెడ్డి జమీలు, ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు, పెంకే సత్యవతి, జెడ్పీటీసీ గవరసాని సూరిబాబు, జిల్లా పంచాయతీ విభాగం అధ్యక్షుడు మోరంపూడి శ్రీ రంగనాయకులు తదితరులు ఉన్నారు.
ప్రత్తిపాడు నియోజకవర్గంలో సేకరించిన సంతకాల ప్రతులను 17 బాక్సులలో సిద్ధం చేశారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాన్ని కిర్లంపూడిలో మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి పార్టీ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యాన పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు వెంట రాగా ర్యాలీగా ప్రత్యేక వాహనాల్లో జిల్లా కార్యాలయంలో అందజేశారు. నియోజకవర్గ పరిశీలకుడు ఒమ్మి రఘురాం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దాపురం, తుని నియోజకవర్గాల పరిశీలకుడు వాసిరెడ్డి జమీల్, పార్టీ రాష్ట్ర అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ అంగులూరి లక్ష్మీ శివకుమారి, పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి బొదిరెడ్ల గోవిందు, జిల్లా ఉపాధ్యక్షుడు బెహరా దొరబాబు, జెట్పీటీసీ గొల్లు చిన దివాణం తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటీకరణపై ప్రజాగ్రహం
ప్రైవేటీకరణపై ప్రజాగ్రహం


