వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దుష్ట పన్నాగం
● ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా
సంతకాల సేకరణ విజయవంతం
● ప్రజల నుంచి అనూహ్య స్పందన
● మాజీ మంత్రి కురసాల కన్నబాబు
కాకినాడ రూరల్: రాష్ట్రంలో వైద్య కళాశాలలను కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టేందుకు చంద్రబాబు నాయుడు దుష్ట పన్నాగం పన్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు దుయ్యబట్టారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం ముగియడంతో బుధవారం ఆ పత్రాలను కన్నబాబు ఆధ్వర్యంలో రమణయ్యపేట వైద్యనగర్ క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి జిల్లా కార్యాలయంలో అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం పేదలు, ప్రజల కోసం ఆలోచిస్తూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 వైద్య కళాశాల నిర్మించాలని సంకల్పించారన్నారు. అప్పటి వరకు కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే రాష్ట్రంలో ఉన్నాయని, జగన్ సీఎంగా ఉన్నప్పుడు 17 వైద్య కళాశాలలు తీసుకువచ్చి, అందులో ఐదింటిని పూర్తిచేసి అడ్మిషన్లు ప్రారంభించి, రెండింటిలో అడ్మిషన్లకు సిద్ధం చేశారన్నారు. మిగతా పది కళాశాలలు వివిధ దశల్లో ఉండగా ప్రభుత్వం మారి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. అనంతరం ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటుపరం చేయాలని దుష్టపన్నాగం పన్నారన్నారు. ఆ సమయంలో జగన్ ప్రజా ఉద్యమం చేపడతామని స్పష్టంగా చెప్పారని, ఆ ప్రకారమే అక్టోబరు 9న నర్సీపట్నం వద్ద నిర్మించిన వైద్య కళాశాల పరిశీలనకు వచ్చారన్నారు. ఆ రోజు శ్రీకారం చుట్టి ఈ రోజుకు దాదాపు 60 రోజులు అయ్యిందన్నారు. పార్టీ నాయకులు, శ్రేణులు కోటి సంతకాల కోసం ప్రజల్లోకి వెళ్లారని, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు 65 వేల సంతకాలు సేకరించామని, వీటిని జిల్లా కార్యాలయానికి అందిస్తున్నామన్నారు. 15వ తేదీన జిల్లాలో భారీ ర్యాలీని అన్ని నియోజకవర్గ ప్రజలతో నిర్వహించి కేంద్ర పార్టీ కార్యాలయానికి సంతకాల పత్రాలను తరలిస్తామన్నారు. 17న తమ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల పత్రాలను గవర్నర్‌కు సమర్పిస్తామన్నారు. ఇలా గతంలో ఎన్నడూ జరగలేదని, సంతకాల సేకరణ అంటే సాధారణంగా తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టడం కాదని, వారి డేటా కూడా అందులో ఉంటుందన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు కళ్లు తెరచి ప్రజల ఆకాంక్ష మేరకు వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిలిపివేయాలన్నారు. సంతకాలు పెట్టిన వారిలో టీడీపీ, బీజేపీ, జనసేన, కమ్యూనిటిస్టు పార్టీల వారితో పాటు అన్ని వర్గాలు ఉన్నాయన్నారు. సంతకాల సేకరణను వైఎస్సార్ సీపీ కార్యక్రమంలా చూసి రాజకీయం చేయకుండా ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళితే 2029లో తమ నాయకుడు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని వెనక్కి తీసుకుని ప్రభుత్వమే నిర్వహిస్తుందని కన్నబాబు హెచ్చరించారు. కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గం పార్టీ నాయుకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


