సత్యదేవుని దర్శనానికి మరో సుపథం
అన్నవరం: సత్యదేవుని రత్నగిరికి వెళ్లేందుకు మొదటి ఘాట్‌రోడ్ వద్ద టోల్‌గేట్ నుంచి స్వామివారి ఆలయం సమీపం వరకు రూ.90 లక్షలతో నిర్మించిన రెండో మెట్లదారి పనులు పూర్తయ్యాయి. సుమారు 450 నున్నటి మెట్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
పూర్వపు ఈఓ, ప్రస్తుత కమిషనర్
రామచంద్రమోహన్ చొరవతో
2010 సంవత్సరంలో ఆలయ ఈఓగా పనిచేసిన ప్రస్తుత దేవదాయశాఖ ఇన్‌చార్జి కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ మెట్ల దారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దేవస్థానం కళాశాల మైదానంలో టూరిస్ట్ బస్సులు, ఇతర వాహనాలను నిలిపి అక్కడ నుంచి కాలినడకన ఆలయానికి వెళ్లే భక్తులు సుమారు అర కిలోమీటరు దూరంలోని తొలి పావంచా వద్దకు నడిచి వెళ్లి అక్కడ నుంచి స్వామివారి ఆలయానికి 400 మెట్లు ఎక్కి వెళ్లాల్సి వచ్చేది. భక్తులకు ప్రయాసతో కూడిన వ్యవహారం. ఈ మేరకు వారికి మార్గం సుగమం అయ్యేలా మెట్ల దారి నిర్మాణానికి ఆయన నడుం కట్టారు. అన్నవరం దేవస్థానం నుంచి ఆయన 2012లో బదిలీ కావడంతో ఆ ప్రతిపాదన మూలన పడింది. 2023లో మళ్లీ ఆలయ ఈఓగా రామచంద్రమోహన్ రావడంతో మెట్ల దారి నిర్మాణానికి టెండర్లు పిలిచి ఖరారు చేసి 2025 ఏప్రిల్‌లో పనులు ప్రారంభించారు.
రెండు మలుపులు, 410 మెట్లు
ఈ మెట్ల దారిని రెండు మలుపులతో 410 మెట్లతో నిర్మించారు. మొదటి ఘాట్‌రోడ్ టోల్‌గేట్ నుంచి ఇది ప్రారంభమై రత్నగిరిపై ఓల్డ్ సీసీ, న్యూ సీసీ సత్రాల మధ్య రోడ్డులో ముగుస్తుంది. అక్కడి నుంచి సత్యదేవుని ఆలయం 200 మీటర్ల దూరం మాత్రమే ఉంటుందని అధికారులు తెలిపారు.
మెషీన్‌తో కట్ చేసిన రాళ్లతో..
రాజస్థాన్ నుంచి తీసుకువచ్చిన అధునాతన మెషీన్‌తో కట్ చేసిన గ్రానైట్, మార్బుల్ రాళ్లను ఈ నిర్మాణానికి వినియోగించారు. మొదటి మెట్ల దారికి ఉపయోగించిన రాళ్లను 50 ఏళ్ల క్రితం శిల్పులు చేతితో చెక్కగా పలకల్లా అమర్చారు.
సంతృప్తిగా నిర్మాణం
కాగా, గత నవంబర్‌లో ఆలయానికి వచ్చిన రామచంద్రమోహన్ మెట్ల నిర్మాణాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మార్గం మధ్యలో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు ల్యాండింగ్ వద్ద విశ్రాంతి షెడ్లు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని, అలాగే మెట్లకు ఇరువైపులా పిట్టగోడ నిర్మించాలని ఆదేశించారు. ఈ పనులు పూర్తయ్యాక ఈ దారిని ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు.
రత్నగిరికి రెండో మెట్లదారి సిద్ధం
మొదటి ఘాట్ రోడ్ నుంచి
ఆలయం వరకు మార్గం సుగమం
రూ.90 లక్షల వ్యయంతో
410 మెట్ల నిర్మాణం
ఆర్చి, పిట్టగోడలు పూర్తయ్యాక ప్రారంభం
ఆర్చి, పిట్టగోడ
నిర్మాణానికి టెండర్లు
మెట్లదారికి ఇరువైపులా పిట్టగోడ నిర్మాణంతో పాటు ప్రారంభంలో ఆర్చి నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవనున్నాం. ఆ పనులను వచ్చే ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని భావిస్తున్నాం.
– వి.రామకృష్ణ, ఈఈ, అన్నవరం దేవస్థానం
సత్యదేవుని దర్శనానికి మరో సుపథం


