ఫొటోలు కాదు.. రైతులను ఆదుకోండి
● డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మధు ధ్వజం
● పిఠాపురంలో రైతులతో కలసి ధర్నా
పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ రైతులతో ఫొటోలు దిగడం కాకుండా వారి సమస్యలు పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపాక మధు పేర్కొన్నారు. బుధవారం స్థానిక వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయం వద్ద సీపీఐ, రైతు సంఘం సంయుక్తంగా ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ బిల్లు రద్దు చేయాలని, సీడ్ బిల్లు ముసాయిదాపై జాతీయ రైతు సంఘాలు
వ్యవసాయ కార్మికసంఘాలు, రైతు మార్కెట్ కమిటీలు, వ్యవసాయ రంగ నిపుణులతో చర్చించి వారి సలహాలు సూచనలు పరిగణనలోకి తీసుకున్నాకే పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యం, పత్తి, మొక్కజొన్న పంటలకు అదనంగా బోనస్ కలిపి కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మార్కెట్ ధరలు పడిపోయిన అరటి, బత్తాయి, నిమ్మ రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, కౌలు రైతులకు అన్నదాత సుఖీ భవ అమలు చేయాలని కోరారు. మెంథా తుపాను, అధిక వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు కౌలు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒక పర్యాయం వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేయాలని, కౌలు రైతులను కూడా ఆదుకోవాలని, ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి రైతు, కౌలు రైతు కుటుంబాలకు రూ.10 లక్షల వరకూ ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, నియోజకవర్గ కార్యదర్శి సాకా రామకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్కా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ ఏడీఏ పి.స్వాతికి వినతి పత్రం అందజేశారు.


