సరదాగా చోరీ.. ప్రవృత్తిగా మారి..
● బైక్‌లను చోరీ చేస్తున్న యువకుడు
● అరెస్టు చేసిన పోలీసులు
● రూ.17.40 లక్షల విలువైన
మోటారు సైకిళ్లు స్వాధీనం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సరదాగా తిరిగేందుకు బైక్‌ను దొంగతనం చేసిన ఆ యువకుడు.. ఆ తర్వాత బైకుల చోరీయే తన ప్రవృత్తిగా మార్చుకున్నాడు. చివరకు రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కపెడుతున్నాడు. రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్, త్రీటౌన్ సీఐ వి.అప్పారావు ఈ వివరాలు వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేటకు చెందిన సబ్బు వీరబాబు చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ వద్ద పెరిగాడు. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద ఉన్న ఓ హోటల్లో నైట్‌బాయ్‌గా పనిచేసేవాడు. పగటి సమయాల్లో వెల్డింగ్ పనులు చేసేవాడు. అతడికి బైక్ లేకపోవడంతో ఏదో విధంగా బైక్ సంపాదించాలని పథకం వేశాడు. పుష్కర్ ఘాట్ వద్ద పార్కింగ్ చేసిన బైక్‌పై అతడి కన్ను పడింది. తన వద్ద ఉన్న పాత తాళంతో ప్రయత్నించగా లాక్ వచ్చేయడంతో అది తీసుకుని ఉడాయించాడు. అనంతరం నగరంలో పలు ప్రాంతాల్లో మోటార్ బైకులను చోరీ చేశాడు. వాటిని తనకు పరిచయమున్న భీమవరానికి చెందిన కోసూరి పవన్ కుమార్, గోకవరం మండలం అచ్యుతాపురానికి చెందిన జార్గాని అప్పన్నలకు తక్కువ ధరకు విక్రయించేవాడు. అలా వచ్చిన సొమ్ములతో జల్సాలు చేసేవాడు.
ప్రత్యేక నిఘా
నగరంలో బైక్ చోరీలు ఎక్కువ కావడంతో ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు త్రీటౌన్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. దీనిలో భాగంగా నిర్వహించిన వాహనాల తనిఖీలో అనుమానాస్పదంగా పట్టుబడిన సబ్బు వీరబాబును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాల చిట్టా బయట పెట్టాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి, అతడు పుష్కర్ ఘాట్, కోటగుమ్మం, మల్లయ్యపేట, సుబ్రహ్యణ్య మైదానం, లాలాచెరువు రోడ్డు, ఇస్కాన్ గుడి, ఆత్రేయపురం మండలం వాడపల్లి వరిసర ప్రాంతాలలో చోరీ చేసిన 29 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.17.40 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. నిందుతుడి నుంచి వాహనాలను కొనుగోలు చేసిన వారిపైనా కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ వి.అప్పారావు ఎస్సై ఎండీ జుబేరు, హెడ్ కానిస్టేబుళ్లు వి.కృష్ణ, ఎన్.వెంకటరామయ్య, ఎస్.చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు బి.విజయ్‌కుమార్, కె.పవన్ కుమార్, ఆర్.సుబ్రహ్మణ్యంలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.


