విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు ప్రాధాన్యం
● వాలీబాల్ ఫెడరేషన్ ఆలిండియా
ఉపాఽధ్యక్షుడు గణవెంకటరెడ్డి
● జేఎన్‌టీయూకేలో టోర్నమెంట్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): క్రీడాకారులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యం ఉంటుందని వాలీబాల్ ఫెడరేషన్ ఆలిండియా ఉపాఽధ్యక్షుడు, వైజాగ్ వెస్ట్ ఎమ్మెల్యే పి.గణవెంకటరెడ్డి నాయుడు అన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ సహకారంలో జేఎన్‌టీయూకేలో ఐదు రోజుల పాటు నిర్వహించే సౌత్ జోన్ ఇంటర్ వర్సిటీ వాలీబాల్ టోర్న్‌మెంట్‌ను బుధవారం ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ యువత క్రీడల్లో పాల్గొనడం ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. క్రీడాకారులకు క్రమశిక్షణ ఎంతో అవసరమని, తద్వారా చదువుతో పాటు క్రీడల్లో రాణించగలరన్నారు. మాజీ అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు, అర్జున్ అవార్డు గ్రహీత పి.వెంకట రమణ మాట్లాడుతూ క్రీడలలో చివరి వరకూ పోరాటం చేసేవారు విజయం సాధిస్తారన్నారు.
గెలుపే లక్ష్యంగా పోరాడాలి
కలెక్టర్ షన్మోహన్ మాట్లాడుతూ వాలీబాల్‌లో సౌత్ ఇండియా రాష్ట్రాలకు కాకినాడ వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి టీమ్ గెలుపే లక్ష్యంగా పోటీపడి ఆడాలన్నారు. జేఎన్‌టీయూకే వీసీ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ మాట్లాడుతూ సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలను జేఎన్‌టీయూకేకు అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి జట్టుకు పూర్తి సహాయ సహకారాలు అందజేసి ఐదు రోజుల పాటు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామన్నారు. జేఎటీయూకేతో పాటు అచ్చంపేట రాజీవ్ గాంధీ కళాశాల, సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో పోటీలు కొనసాగుతాయన్నారు. ఫైనల్ పోటీలను జేఎన్‌టీయూకే మైదానంలో నిర్వహిస్తామన్నారు. తొలి రోజు 40 మ్యాచ్‌లు జరిగాయని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, అబ్జర్వర్ త్రిమూర్తులు, రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, స్పోర్ట్స్ కౌన్సెల్ కార్యదర్శి బి.శ్యామ్ కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ జీపీ రాజు పాల్గొన్నారు.
విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు ప్రాధాన్యం


