అన్నవరం దేవస్థానం ఈఓగా త్రినాథరావు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఫుల్ అడిషనల్ చార్జి)గా వి.త్రినాథరావు బుధవారం సాయంత్రం 4.30 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. తొలుత రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. అనంతరం దర్బారు మండపంలో పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ప్రస్తుత ఈఓ వీర్ల సుబ్బారావు నుంచి బాధ్యతలు స్వీకరించారు. దేవదాయశాఖ రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్‌జేసీ)గా పనిచేస్తున్న వి.త్రినాథరావును ఈఓగా నియమిస్తూ మంగళవారం ఆదేశాలు వెలువడిన విషయం తెలిసిందే.
దేవస్థానం అభివృద్ధికి కృషి
అన్నవరం దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఈఓ త్రినాథరావు అన్నారు. సత్యదేవుని ఆశీసులతో ఈ పదవి చేపట్టడం ఇది నాలుగోశారని, ఆ అనుభవంతో దేవస్థానంలో భక్తులకు అవసరమైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. కాగా.. డిప్యూటీ కలెక్టర్ హోదాలో సుమారు ఏడాది పాటు డిప్యూటేషన్‌పై అన్నవరం దేవస్థానం ఈఓగా పనిచేసి, తిరిగి రెవెన్యూ విభాగానికి వెళుతున్న వీర్ల సుబ్బారావును దేవస్థానం సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఆయనకు శాలువా కప్పి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను నూతన ఈఓ త్రినాథరావు అందజేశారు.


