స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ఆందోళన వద్దు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): స్క్రబ్ టైఫస్ ‘పురుగు‘ (కీటకం) కుట్టడం వల్ల వ్యాపించే వ్యాధి వల్ల ఎవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. ఈ వ్యాధిపై సోమవారం కలెక్టరేట్ లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. పురుగు కుట్టడం గమనించినట్లయితే సమీప ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని సూచించారు. స్క్రబ్ టైఫస్ ఇది వైరస్ కాదని, ఓరింటియా సుత్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందన్నారు. ఈ బ్యాక్టీరియా సోకిన చిన్న కీటకాలు మనుషులను కుట్టడం ద్వారా వ్యాధి సంక్రమిస్తుందన్నారు. ముఖ్యంగా ఎలుకలు సంచరించే ప్రదేశాలలో ఉండే కీటకాలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. పరిశుభ్రత పాటించాలన్నారు. పొదలు, గడ్డి ఉన్న ప్రదేశాలలో తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎలుకలు ఇంట్లోకి రాకుండా నిరోధించాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందాలన్నారు. చికిత్స కోసం స్థానిక ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలన్నారు. వదంతులు నమ్మవద్దని సరైన చికిత్స తీసుకుంటే త్వరితగతిన కోలుకొంటారన్నారు. డీఎంహెచ్‌ఓ జె.నరసింహ నాయక్, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్ లావణ్య కుమారి, ఇతర వైద్యులు పాల్గొన్నారు.


