జిల్లాలో 2019 నుంచి రిజిస్ట్రేషన్ల వివరాలు
ఫ పడకేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం
ఫ కానరాని కొనుగోలుదార్లు
ఫ పెట్టుబడులు రావడం
లేదని రియల్టర్ల గగ్గోలు
ఫ బోల్తా కొట్టిన బాబు విజన్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు విజన్ బోల్తా కొట్టింది. గద్దెనెక్కితే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానంటూ ఎన్నికల సమయంలో బాబు చెప్పిందంతా మాటల గారడీయేనని తేలిపోతోంది. సర్కారు వారి విధానాలతో ఏ రంగం చూసినా దాదాపు తిరోగమనంలోనే పయనిస్తూండగా.. ఆ కోవలో రియల్ ఎస్టేట్ కూడా చేరిపోయింది. సాధారణంగా భూముల అమ్మకాలు, కొనుగోళ్లు మూడు వెంచర్లు.. ఆరు ప్లాట్లు అన్నట్టుగా జరుగుతుంటాయి. ఏడాదిన్నర క్రితం వరకూ అప్పటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ప్రోత్సాహంతో కొనుగోళ్లు, అమ్మకాలతో రియల్ ఎస్టేట్ రంగం కళకళలాడింది. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకంలో నడిపించిన నాటి జగన్ పాలనా కాలంలో ఇలా వెంచర్ వేస్తే.. అలా ప్లాట్లు అమ్ముడయ్యేవని రియల్టర్లు చెబుతున్నారు. ఆరేడు నెలలకే ప్లాట్లు అమ్ముకుని సొమ్ము చేసుకునే వారమని, ఏడాది తిరగకుండానే వెంచర్లపై పెట్టిన పెట్టుబడి, ఆశించిన లాభం చేతికొచ్చేదని, ఇప్పుడంతా తలకిందులైందని అంటున్నారు. జిల్లా కేంద్రం కాకినాడ నగరంతో పాటు కాకినాడ రూరల్, తుని, అన్నవరం, పిఠాపురం, గొల్లప్రోలు, పెద్దాపురం, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో లే అవుట్లు వేసి ప్లాట్లు విభజించి ఏడాది పైనే అవుతున్నా కొనేవారే కనిపించడం లేదని వాపోతున్నారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు చివరకు తమ చేతికి సొమ్ము రాని పరిస్థితి సృష్టించారని, పెట్టిన పెట్టుబడికి వడ్డీలు చెల్లించలేక నానా పాట్లూ పడుతున్నామని గగ్గోలు పెడుతున్నారు.
భూముల విలువ పెంపుతో..
అనుకున్నదొకటి అయ్యినదొకటి అన్న చందంగా చంద్రబాబు సర్కారు వచ్చాక రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో ప్రభుత్వ ఆదాయంలో పెరుగుదల ఉన్నట్లు కనిపిస్తోందే తప్ప.. వాస్తవంగా చూస్తే ఈ రంగం చతికిలపడింది. చంద్రబాబు గద్దెనెక్కాక ఈ ఏడాది ఫిబ్రవరిలో భూముల మార్కెట్ విలువను పెంచారు. అర్బన్, రూరల్ ప్రాంతాల్లో 5 నుంచి 20 శాతం, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఏకంగా 60 శాతం వరకూ పెంచారు. దీనివలన దండిగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావించగా.. ఈ నిర్ణయమే రియల్ ఎస్టేట్ రంగాన్ని దారుణంగా దెబ్బ తీసింది. భూముల ధరలు భారీగా పెరిగిపోవడంతో అడపాదడపా ప్లాట్లు కొందామనుకున్న వారు కూడా వాయిదా వేసుకుంటున్నారు.
పడిపోయిన రిజిస్ట్రేషన్లు
భూముల ధరలు పెరగడంతో నిర్దేశిత లక్ష్యాల మేరకు రిజిస్ట్రేషన్లు పెరుగుతాయని ప్రభుత్వం ఆశించింది. కానీ, వాస్తవానికి రిజిస్ట్రేషన్లు మాత్రం పెద్దగా
పెరిగింది లేదు. జగన్ ఐదేళ్ల పాలనలో రియల్ ఎస్టేట్ రంగం కళకళలాడింది. జరిగిన రిజిస్ట్రేషన్లు, వచ్చిన ఆదాయమే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. చివరకు కోవిడ్ సమయంలో సైతం రిజిస్ట్రేషన్లు ఆశాజనకంగానే జరిగి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ ఆదాయం గణనీయంగా పెరిగింది. గత ప్రభుత్వంలో రోజువారీగా వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతూండేవి. ప్రస్తుతం అవి పదుల సంఖ్యకే పరిమితమయ్యాయి. కాకినాడ రూరల్ ఏడీబీ రోడ్డు, సర్పవరం, రమణయ్యపేట, తిమ్మాపురం, పెనుమర్తి, చీడిగ, ఇంద్రపాలెం, కరప మండలం నడకుదురు, పెనుగుదురు, శంఖవరం మండలం అన్నవరం, తుని పట్టణంతో పాటు తుని రూరల్‌లో వెంచర్లు వేసి ఏడాది కావస్తున్నా ప్లాట్లు అమ్ముడవ్వక రియల్టర్లకు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. ఏడాదిన్నర బాబు పాలనలో రియల్ ఎస్టేట్ బోర్లా పడింది. లే అవుట్ కోసం వ్యవసాయ భూములను వ్యవసాయేతరంగా మార్చేందుకు రెవెన్యూకు దరఖాస్తు చేయడం మొదలు అడుగడుగునా ఆమ్యామ్యాలతో పెట్టుబడి తడిసి మోపెడవుతోందని గొల్లుమంటున్నారు. డ్రైన్లు, 30, 60 అడుగుల రోడ్లు వేసినా కొనేవారే లేకుండా పోయారు. ఆ ప్లాట్లు కనీసం ఏడాదిలోపు అమ్ముడైతే స్వల్ప లాభాలతోనైనా గట్టెక్కుతామని, ఇందుకు భిన్నంగా ఒక పక్క ప్లాట్ కూడా అమ్ముడవక, రూ.లక్షల్లో తెచ్చిన అప్పులకు మరోపక్క వడ్డీలు చెల్లించలేక నానా పాట్లూ పడుతున్నామని వాపోతున్నారు. బాబు ప్రభుత్వం ఈ రంగానికి కనీస ఊతమిచ్చి ఉంటే ఇప్పుడీ పరిస్థితి ఎదురయ్యేది కాదని ఈ రంగంలో స్థిరపడ్డ రియల్టర్లు అంటున్నారు. చంద్రబాబు సంపద సృష్టి మాటలు వట్టి బూటకంగా మారాయని భూముల క్రయ విక్రయదారులు ఆక్షేపిస్తున్నారు.
కరపలో లే అవుట్
సంవత్సరం ఆదాయం సాధించినది సాధించిన రిజిస్ట్రేషన్లు
లక్ష్యం (రూ.కోట్లు) (రూ.కోట్లు) లక్ష్యం (శాతం)
2019–20 284.17 203.78 71.71 70,802
2020–21 266.93 222.07 83.19 68,736
2021–22 332.78 351.10 105.50 1,12,808
2022–23 460.16 363.42 78.98 72,898
2023–24 544.27 382.05 70.19 94,384
2024–25 615.39 386.54 62.81 91,243
అంతకు ముందు ఐదేళ్లతో పోలిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ఆర్థిక సంవత్సరంలో అతి తక్కువ లక్ష్య సాధన నమోదైంది. అలాగే, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ ఆదాయం లక్ష్యం రూ.355.71 కోట్లు కాగా, రూ.299.68 కోట్లు మాత్రమే సమకూరింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నాలుగు నెలలు మాత్రమే మిగిలి ఉండగా ఇంతవరకూ 57,299 దస్తావేజుల రిజిస్ట్రేషన్ మాత్రమే జరగడం గమనార్హం.
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చంద్రబాబు ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ
పెంచిందిలా (చదరపు గజానికి రూ.లలో)
గ్రామం పాత ధర పెరుగుదల
పనసపాడు 7,000 9,000
తిమ్మాపురం 6,000 8,000
నేమాం 6,000 8,000
పండూరు 4,000 6,000
వాకలపూడి 9,000 12,000
వలసపాకల 9,000 15,000
కట్టమూరు 11,000 18,000
ఆనూరు 1,200 1,800
నాయకంపల్లి 1,100 1,600
రియల్ ఎస్టేట్ దిగజారింది
రియల్ ఎస్టేట్ వ్యాపారం దిగజారిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమ్మకాలు, కొనుగోళ్లు చాలా వరకూ తగ్గిపోయాయి. రియల్ ఎస్టేట్ పుంజుకునే విధానాలను ప్రభుత్వం చేపట్టడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే రియల్ ఎస్టేట్ వ్యాపారం మనుగడే కష్టం. ఈ రంగంపై ఆధారపడి చాలా మంది జీవనోపాధి పొందుతున్నారు. గత వైఎస్సార్ సీపీ హయాంలో లే అవుట్లపై కూడా బాబు ప్రభుత్వం 18 నెలల కాలంలో నోటీసులిచ్చి ఇబ్బందులకు గురి చేస్తోంది. అమ్మకాలు జరగకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు.
– కొప్పిశెట్టి గణేష్,
రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాకినాడ రూరల్
జిల్లాలో 2019 నుంచి రిజిస్ట్రేషన్ల వివరాలు
జిల్లాలో 2019 నుంచి రిజిస్ట్రేషన్ల వివరాలు


