ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో చంద్రబాబు ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. జిల్లావ్యాప్తంగా సంతకాలు సేకరించడం ద్వారా వచ్చిన ప్రజాభిప్రాయాన్ని క్రోడీకరించే కార్యక్రమంపై ఏడు నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాల ప్రతులతో ర్యాలీలు నిర్వహించి, ఈ నెల 13న పార్టీ జిల్లా కార్యాలయంలో అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా వచ్చిన ప్రజాభిప్రాయాన్ని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేస్తామని చెప్పారు. సమావేశం అనంతరం రాజా మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకాలు చేసి, వ్యక్తం చేసిన ప్రజాభిప్రాయంపై అధికార పార్టీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఏవైనా అనుమానాలుంటే డిజిటలైజ్ చేసిన సంతకాలను, వారి ఫోన్ నంబర్ల ఆధారంగా పరిశీలించుకోవచ్చని సవాల్ విసిరారు. జిల్లాలో సేకరించిన 4 లక్షల పై చిలుకు సంతకాల పత్రాలను పార్టీ అధినేత జగన్ ద్వారా గవర్నర్‌కు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి 20 వేల మందికి తక్కువ కాకుండా సిద్ధం కావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
అన్ని వర్గాలకూ వంచన
పరిపాలన తీరు చూస్తూంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని రాజా అన్నారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలనూ ప్రభుత్వం వంచిస్తోందని ధ్వజమెత్తారు. మోంథా తుపాను దెబ్బకు రైతులు అధోగతి పాలైతే ఇంతవరకూ ఒక్క పైసా కూడా పరిహారం ఇవ్వని ప్రభుత్వాన్ని ఏమనాలని ప్రశ్నించారు. జగన్ సీఎంగా ఉండగా ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు 33 శాతం పైబడి పంటకు నష్టం జరిగితే వారం తిరగకుండానే ఇన్‌పుట్ సబ్సిడీ, నష్టపరిహారం అందించిన విషయాన్ని గుర్తించాలని, వెంటనే రైతులను ఆదుకుని చంద్రబాబు ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హితవు పలికారు. జగన్ హయాంలో మాదిరిగా చంద్రబాబు ప్రభుత్వం రైతులకు సాయం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. రైతుల వద్దకు మంత్రులు వెళ్తూ వారి గోడు విన్నాక తాము ముఖ్యమంత్రులం కాదని చెబుతున్నారంటే పాలన ఎటువైపు పోతోందో అర్థం కావడం లేదని విమర్శించారు. మంత్రులంటేనే ప్రభుత్వమనే విషయం వారికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు.
రాజకీయ స్టంట్
మెగా పీటీఎం పేరిట తల్లిదండ్రులను పిలిపించి రాజకీయ సమావేశాలు పెట్టడం, వీటిల్లో పార్టీ నేతలు కూర్చోవడం రాజకీయ స్టంట్‌లా కనిపించిందని రాజా విమర్శించారు. పెద్ద పెద్ద ఈవెంట్ల మాదిరిగా రూ.కోట్లు ఖర్చు చేసినట్టుగా ఈ సమావేశాలున్నాయన్నారు. ఏడాదిన్నర కాలంలో పట్టుమని ఒక క్లాస్ రూముకు రూ.వెయ్యి వెచ్చించారా అని నిలదీశారు. తొండంగి మండలం బెండపూడి జెడ్పీ హైస్కూల్‌లో ఆంగ్ల మాధ్యమంలో అదరగొట్టిన విద్యార్థినులను నాడు సీఎంగా జగన్ పిలిపించుకుని, వారితో కలిసి భోజనం చేసి ప్రోత్సహించారని గుర్తు చేశారు. ఇప్పుడదే స్కూల్‌లో పీటీఎం సమావేశాలను రాజకీయాలకు వేదికగా చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంటరీ పరిశీలకుడు డి.సత్యనారాయణరాజు, మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు తోట నరసింహం, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, దవులూరి దొరబాబు, ముద్రగడ గిరిబాబు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట శ్రీరాంజీ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, ప్రచార విభాగం ఉపాధ్యక్షుడు రావూరి వెంకటేశ్వరరావు, యువజన విభాగం సిటీ అధ్యక్షుడు రోకళ్ల సత్య తదితరులు పాల్గొన్నారు.
ఫ దీనికి అద్దం పట్టిన
కోటి సంతకాల ఉద్యమం
ఫ జిల్లాలో 4 లక్షల పైగా సంతకాలు
ఫ అనుమానాలుంటే చెక్ చేసుకోండి
ఫ అధికార పక్షానికి
దాడిశెట్టి రాజా సవాల్
ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటం


