చెల్లించిన సొమ్ముకే ఇళ్లు స్వాధీనం చేయాలి
సామర్లకోట: ఇప్పటికే చెల్లించిన సొమ్ముతోనే టిడ్కో ఇళ్లు వెంటనే స్వాధీనం చేయాలని, రుణ వాయిదాలు చెల్లించలేని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఉప్పువారి సత్రం, జగ్గమ్మగారిపేటలోని టిడ్కో గృహ సముదాయం వద్ద వారు శనివారం ధర్నా నిర్వహించారు. ఎన్నికల ముందు టీడీపీ నాయకులు తమ ఇళ్ల వద్దకు వచ్చి రుణాలు చెల్లించవద్దంటూ చెప్పారని అన్నారు. తీరా ఇప్పుడు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని, వారం రోజుల్లో రుణ వాయిదాలు చెల్లించకపోతే ఇళ్లు స్వాధీనం చేసుకుంటామంటూ మున్సిపల్ అధికారులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. రూ.500 చెల్లించిన వారికి ఉచితంగా ఇచ్చారని, ఈ నేపథ్యంలో రూ.50 వేలు, రూ.లక్ష చెల్లించిన వారికి వెంటనే ఇళ్లు స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. నాణ్యత లేకుండా నిర్మించడంతో టిడ్కో ఇళ్లలో వర్షపు నీరు దిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల క్రితం లబ్ధిదారుల ఎంపిక సమయంలో జి+1 పద్ధతిలో ఇళ్లు నిర్మిస్తామని చెప్పి, జి+3 నిర్మాణాలు చేశారని ఆరోపించారు. తమ వాటా చెల్లించిన అనేక మందికి ఇప్పటికీ ఇళ్లు స్వాధీనం చేయలేదన్నారు. అలాగే, బ్యాంకు రుణాలు మంజూరు చేసిన ఇళ్లు కూడా స్వాధీనం చేయలేదని చెప్పారు. దీనివలన లబ్ధిదారులు అప్పులకు వడ్డీలతో పాటు బయట ఇళ్ల అద్దె కూడా చెల్లించాల్సి వస్తోందని వాపోయారు. బ్యాంకు అధికారులు 20 ఏళ్ల పాటు నెలకు రూ.4,200 నుంచి రూ.4,900 వరకూ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. 20 ఏళ్ల పాటు బ్యాంకుకు వాయిదాలు చెల్లిస్తూ ఉంటే కూలి పని చేసుకునే వారు ఏం తినాలని ప్రశ్నించారు. ఇప్పటికే తమ సమస్యను టీడీపీ నాయకులు, మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా స్పందన లేదని అన్నారు. తమకు న్యాయం చేయకపోతే కలెక్టరేట్ వద్ద ధర్నాకు సిద్ధమని హెచ్చరించారు. టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తారనే ఆశతోనే చంద్రబాబుకు ఓట్లు వేశామని, అయితే ఆయన వలన తమకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. రూ.లక్ష చెల్లించి పదేళ్లయ్యిందని, దీనికి వడ్డీగా రూ.4 లక్షల వరకూ చెల్లించామని వాపోయారు. ధర్నాకు కె.వరలక్ష్మి, దగ్గు పద్మ, దుర్గాలక్ష్మి, కందుకూరి కిరణ్‌కుమార్ తదితరులు నాయకత్వం వహించారు.
ఫ రుణాలు చెల్లించవద్దని
గతంలో టీడీపీ నాయకులే చెప్పారు
ఫ ఇప్పుడు బ్యాంకులు,
అధికారుల బెదిరింపు తగదు
ఫ అప్పులు చెల్లించలేమని
లబ్ధిదారుల ఆవేదన
ఫ టిడ్కో గృహ సముదాయం వద్ద ధర్నా


