అరకొర నిధులతో ఎలా?
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం మెగా పేరెంట్ – టీచర్స్ మీటింగ్ (పీటీఎం) 3.0 పండగలా నిర్వహించాలంటూ ఏపీ విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ సమావేశాలకు ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాకమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలి. పాఠశాల ప్రగతిని చాటి చెప్పాలి. ప్రతి విద్యార్థి ప్రగతిని వారి తల్లిదండ్రులకు తెలియజేయాలి. అయితే, అరకొర నిధులు మాత్రమే ఇచ్చి, ఈ కార్యక్రమాన్ని పండగలా చేయాలంటూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై ఉపాధ్యాయులు విస్తుపోతున్నారు. విద్యార్థుల సంఖ్య ప్రామాణికంగా నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ పేర్కొంది. ఉదాహరణకు 30 మంది విద్యార్థులున్న పాఠశాలల్లో వారి తల్లిదండ్రులను, స్థానిక ప్రజాప్రతినిధులను పిలిచి, రూ.900తో భారీగా సమావేశం నిర్వహించి పండగలా జరపాలని పేర్కొంటోంది. జిల్లాలోని 1,280 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సుమారు 1.30 లక్షల మంది ఒకటి నుంచి పదో తరగతి వరకూ చదువుతున్నారు. పీటీఎం నిర్వహణకు గాను జిల్లాలోని మొత్తం పాఠశాలలకు ప్రభుత్వం రూ.33,44,150 కేటాయించింది. ప్రస్తుత ధరల ప్రకారం ఈ సమావేశం నిర్వహణకు ప్రభుత్వం జారీ చేసిన నిధులు ఏమాత్రం చాలవని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మెగా పీటీఎం సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలను అందరూ తప్పనిసరిగా పాటించాలని డీఈఓ పిల్లి రమేష్ ఆదేశించారు.
ఫ నేడు ప్రభుత్వ పాఠశాలల్లో
మెగా పీటీఎం
ఫ 1,280 స్కూళ్లకు రూ.30 లక్షలు మాత్రమే కేటాయింపు
ఫ పండగలా చేయాలన్న సర్కారు
ఆదేశాలపై ఉపాధ్యాయుల ఆగ్రహం
పాఠశాలల వారీగా నిధుల మంజూరు
విద్యార్థుల స్కూల్స్ యూనిట్ నిధులు
సంఖ్య కాస్ట్ (రూ.)
0–30 541 900 4,86,900
31–100 392 2,250 8,82,000
101–250 169 4,500 7,60,500
251–1,000 173 6,750 11,67,750
వెయ్యికి పైగా 5 9,000 45,000
మెగా పీటీఎంతో ఇబ్బందులు
మెగా పీటీఎం నిర్వహణకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ఏమాత్రం సరిపోవు. ప్రధానంగా ఏకోపాధ్యాయ పాఠశాలలకు చాలా ఇబ్బందులున్నాయి. దీనికి తోడు ఈ సమావేశం తేదీని హడావుడిగా ప్రకటించారు. అలాగే ఆరో తేదీ నుంచి పదో తరగతి విద్యార్థుల వంద రోజుల షెడ్యూలు ప్రకటించారు. ఇవన్నీ ఉపాధ్యాయులకు తీవ్ర ఒత్తిడి కలిగిస్తున్నాయి.
– చింతాడ ప్రదీప్ కుమార్. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు


