కార్పొరేట్‌లో ప్రాక్టికిల్స్‌ | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌లో ప్రాక్టికిల్స్‌

Dec 4 2025 7:34 AM | Updated on Dec 4 2025 7:34 AM

కార్ప

కార్పొరేట్‌లో ప్రాక్టికిల్స్‌

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పుస్తకాల్లోని పాఠ్యాంశాలు నూరు శాతం బుర్రకెక్కాలంటే ప్రయోగాలు తప్పనిసరి. అందుకనుగుణంగా విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే వాటిని విద్యార్థులతో చేయించాలి. కొన్ని ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలలు ఇలాంటి ప్రయోగాలను అటకెక్కిస్తున్నాయి. ప్రాక్టికల్స్‌ను పక్కన పెట్టి.. ఆ పీరియడ్లను థియరీకి వినియోగిస్తున్నాయి. ప్రాక్టికల్స్‌కు సంబంధించి ద్వితీయ సంవత్సరం చివరిలో, అది కూడా ప్రాక్టికల్‌ పరీక్షలు మరో 20 రోజులుండగా ల్యాబ్‌ గదులు తెరుస్తున్నారు. ఆయా పరికరాలకున్న బూజులు దులిపి విద్యార్థులతో అరకొర ప్రాక్టికల్స్‌ చేయిస్తుస్తారు. వీటిని తనిఖీ చేయాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా విద్యార్థుల్లో ప్రాక్టికల్‌కు సంబంధించిన ప్రమాణాలు గణనీయంగా క్షీణిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో దాదాపు 37 వేల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు.

అన్ని యాజమాన్య కళాశాలల్లోనూ..

జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్య జూనియర్‌ కళాశాలల్లో ఫస్టియర్‌ అకడమిక్‌ ప్రారంభం నుంచే థియరీకి సమాంతరంగా ప్రాక్టికల్స్‌ తరగతులను నిర్వహించాల్సి ఉంది. ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. థియరీ బోధనకు సమయం చాలదని ప్రాక్టికల్స్‌కు అంతగా ప్రాధాన్యమివ్వడం లేదు. ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో మాత్రం సెకండియర్‌ విద్యార్థులకు పీరియడ్లను కేటాయించి, ప్రాక్టికల్స్‌ తరగతులను నిర్వహిస్తూ విద్యార్థులతో ప్రయోగాలను చేయిస్తున్నారు.

స్కోర్‌ పెరుగుదలకు..

ప్రాక్టికల్స్‌ పరీక్షలకు సంబంధించి కెమిస్ట్రీ, ఫిజికల్‌ సైన్స్‌, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు సంబంధించి ఒక్కోదానికి 30 మార్కులుండటంతో వాటికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. సెకండియర్‌లో మార్కుల స్కోర్‌ పెరగడానికి ప్రాక్టికల్స్‌ మార్కులు బాగా దోహదపడతాయి. జిల్లావ్యాప్తంగా ప్రైవేట్‌, కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలలు ఇంటర్మీడియెట్‌ నిబంధనలకు పాతరేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అడ్డదారుల్లో మార్కులు తెచ్చుకునే వెసులుబాటుకు అలవాటు పడిన యాజమాన్యాలు ప్రాక్టికల్స్‌ పీరియడ్లను పక్కన పెట్టేశాయని మండిపడుతున్నాయి. కళాశాలలు ప్రారంభమై నెలలు గడుస్తున్నా.. ఈ రోజుకు విద్యార్థులతో ఒక్క ప్రయోగం కూడా నిర్వహించలేదని సమాచారం.

చోద్యం చూస్తున్న యంత్రాంగం

ప్రైవేట్‌, కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలల్లో అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం సిలబస్‌, తరగతులు, పరీక్షల నిర్వహణపై తనిఖీలు నామమాత్రంగా ఉన్నాయనే ఆరోపణలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండడం, అదే పార్టీకి చెందిన పెద్ద మనిషి మంత్రి పదవిలో ఉండటంతో.. కార్పొరేట్‌ కళాశాలలపై ఇంటర్మీడియెట్‌ అధికారుల చోద్యం చూడటం మినహా చేసేదేమీ లేదనే విమర్శలూ లేకపోలేదు. దీనికితోడు ప్రాక్టికల్స్‌ పరీక్షల సమయంలో ఒక్కో విద్యార్థి నుంచి రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు అదనంగా వసూలు చేసి, ఆ సొమ్మును ప్రాక్టికల్స్‌ పరీక్షల నిర్వహణకు వచ్చే సిబ్బందికి ముడుపులుగా ఇస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

జిల్లాలో జూనియర్‌ కళాశాలలు

ఎయిడెడ్‌ 3 ప్రభుత్వ 14 కేజీబీవీ 4 ఆదర్శ 2 ప్రైవేట్‌ 125

ల్యాబ్‌లు సక్రమంగా ఉండాలి

జిల్లాలోని ఇంటర్మీడియెట్‌ కళాశాలల్లో చాలావరకూ ల్యాబ్‌లు లేవు. ఉన్న కొద్దిపాటి గదుల్లో లెక్కకు మించి విద్యార్థులను ఉంచి తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకే గదులు సక్రమంగా లేకపోతే.. ఇక ల్యాబ్‌లకు ఎక్కడ సౌకర్యం ఉంటుంది. ఆయా సమస్యలపై అధికారులు దృష్టి సారించాలి.

– బి.సిద్ధూ, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పీడీఎస్‌యూ

తనిఖీలు చేసి.. చర్యలు తీసుకుంటాం

ప్రైవేట్‌, కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలల్లో అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం తప్పనిసరిగా ప్రాక్టికల్స్‌ తరగతులు నిర్వహించాలి. దీనిపై జిల్లాలోని అన్ని యాజమాన్య కళాశాలల్లో ప్రాక్టికల్స్‌ తరగతుల నిర్వహణపై తనిఖీలు చేస్తాం. ప్రాక్టికల్స్‌ నిర్వహించని ఆయా కళాశాలల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటాం.

– ఐ.శారద, డీఐఈఓ, కాకినాడ జిల్లా

ఇంటర్మీడియెట్‌ కళాశాలల్లో

బూజు పట్టిన ల్యాబ్‌లు

అటకెక్కిన పరికరాలు, రసాయనాలు

కొన్ని ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో

కాగితాలకే పరిమితం

చోద్యం చూస్తున్న

అధికార యంత్రాంగం

కార్పొరేట్‌లో ప్రాక్టికిల్స్‌ 1
1/3

కార్పొరేట్‌లో ప్రాక్టికిల్స్‌

కార్పొరేట్‌లో ప్రాక్టికిల్స్‌ 2
2/3

కార్పొరేట్‌లో ప్రాక్టికిల్స్‌

కార్పొరేట్‌లో ప్రాక్టికిల్స్‌ 3
3/3

కార్పొరేట్‌లో ప్రాక్టికిల్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement