ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..?
పిఠాపురం: నియోజకవర్గంలో రోజుకో దారుణం జరుగుతోంది, ప్రాణాలు పోయాల్సిన ఆస్పత్రుల్లో ప్రాణా లు పోతున్నాయి, కుల వివక్ష పెరిగిపోతోంది.. ఇన్ని జరుగుతున్నా చంద్రబాబు సర్కార్ పట్టించుకోకపోవడం దారుణంగా ఉందంటూ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎంపీ వంగా గీత తీవ్రంగా మండిపడ్డారు. ఆమె బుధవారం పిఠాపురంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, పిఠాపురం సీహెచ్‌సీలో వైద్య సేవలు దిగజారి ప్రజల ప్రాణాలు పోతున్నాయన్నారు. కొన్ని నెలలుగా వరుస దురదృష్టకర సంఘటనలు చోటుచేసుకుని, రోగులు, గర్భిణులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. తాజాగా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో 24 గంటలు వైద్య సేవలు అందించాల్సిన ఆస్పత్రికి తాళాలు వేసి ఉంచడంతో, వైద్యం అందక ఓ వ్యక్తి నిండు ప్రాణం బలైందన్నారు. ఆస్పత్రి మూసి ఉంచడంతో పాటు, సకాలంలో 108 చేరక ప్రాణం పోయిందని, బాధ్యులెవరో ప్రభుత్వ పెద్దలు తేల్చాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108 వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేసి, పీహెచ్‌సీలను బలోపేతం చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం వాటిని మూసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని దుయ్యబట్టారు. గతంలో మల్లాంలో కుల బహిష్కరణ జరగగా, మరోవైపు కొత్తపల్లి మండలం యండపల్లి పాఠశాలలో కుల వివక్ష ఘటన తీవ్ర కలవరానికి గురి చేసిందన్నారు. ఆయా విషయాలపై అధికార పార్టీల నేతలు నోరు మెదపకపోవడం చూస్తుంటే అసలు పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుందోనన్న భయాందోళన ప్రజలకు కలుగుతోందన్నారు. సమస్యలతో సతమతమవుతున్న అధికారులు ప్రజలకు ఎలా సేవలు అందించగలరని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మరుగున పడ్డాయని, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. వైద్య సేవలు గాడి తప్పడంతో ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోందన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా గొప్ప పేరున్న పిఠాపురంలో దారుణాలను వెంటనే ఆపాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కోరారు. ఆస్పత్రుల్లో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి వెంటనే స్పందించి విచారణ జరిపించాలని, పిఠాపురంలో పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీటిపై దృష్టి సారించకపోతే ప్రజల తరఫున వైఎస్సార్ సీపీ శ్రేణులు ఉద్యమిస్తారని హెచ్చరించారు. పార్టీ నేతలు రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, ఉలవల భూషణం, ముమ్మిడి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గంలో పరిణామాలపై
పవన్ దృష్టి సారించాలి
వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి
వెంటనే ఆస్పత్రులు పరిశీలించాలి
పట్టించుకోకపోతే ప్రజల తరఫున ఆందోళన
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎంపీ వంగా గీత


