16 మందితో హ్యాండ్ బాల్ జిల్లా జట్టు
సామర్లకోట: కర్నూల్ డీఎస్‌ఏ స్టేడియంలో గురువారం నుంచి ఆరో తేదీ వరకూ జరిగే రాష్ట్ర స్థాయి పురుషుల హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టును బుధవారం ఎంపిక చేశారు. ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంవీవీ దుర్గాప్రసాద్ వివరాలు తెలిపారు. సామర్లకోట మండలం పనసపాడులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో జరిగిన హ్యాండ్ బాల్ ఎంపిక పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి 40 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరికి పోటీలు నిర్వహించి 16 మందిని ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. వీరు అంతర్ జిల్లాల హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొంటారు. జిల్లా జట్టును సంఘ సభ్యులు ప్రభాకర్, రవికుమార్, చంద్రశేఖర్, శివ, వెంకట్, ఏసు ఎంపిక చేశారు. ఈ జట్టు బుధవారం సాయంత్రం కర్నూల్‌కు బయలుదేరింది.


