వక్ఫ్ ఆస్తులను పోర్టల్‌లో నమోదు చేయాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): సమయం చాలా తక్కువగా ఉన్నందున వక్ఫ్ ఆస్తుల వివరాలను పోర్టల్‌లో వీలైనంత త్వరగా అప్‌లోడ్ చేయాలని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి హసన్ షరీఫ్ బుధవారం ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల ఐదు లోపు ఆస్తుల వివరాలను ఉమిద్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. వారం రోజులుగా పోర్టల్ సక్రమంగా పనిచేయడం లేదన్నారు. ఆస్తుల వివరాల నమోదుకు ప్రభుత్వం సమయం పెంచాల్సి ఉండగా, పట్టించుకోవడం లేదన్నారు.
వీరేశ్వరస్వామికి
రూ.9.96 లక్షల ఆదాయం
ఐ.పోలవరం: మురమళ్ల వీరేశ్వరస్వామి దేవస్థానానికి హుండీల ద్వారా రూ.9.96 లక్షల ఆదాయం సమకూరినట్టు ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి వి.సత్యనారాయణ తెలిపారు. అంతర్వేది అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్, తనిఖీ అధికారి రామలింగేశ్వరరావు సమక్షంలో బుధవారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ 45 రోజులకు గాను ఆలయంలో ప్రధాన హుండీ ద్వారా రూ.9,87,354, అన్నదాన హుండీ ద్వారా రూ.8,849 వెరసి రూ.9,96,203 సమకూరినట్లు తెలిపారు. వీటితో పాటు 5 విదేశీ రియాల్స్ వచ్చాయన్నారు. హుండీ ఆదాయం సొమ్మును దేవస్థానం ఖాతాకు జమ చేస్తున్నట్టు వివరించారు. తొలుత ఆలయ అర్చకులు యనమండ్ర సుబ్బారావు, యనమండ్ర సత్య సీతారామ శర్మ, పేటేటి శ్యామల కుమార్ హుండీలకు హారతి ఇచ్చి, లెక్కింపును లాంఛనంగా ప్రారంభించారు.


