ప్రభుత్వ వైఖరితో రైతు కంట కన్నీరు
● రైతుల సమస్యలపై
10న పిఠాపురంలో ఆందోళన
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు
తాటిపాక మధు
పిఠాపురం: ఏ రైతును కలిసినా పిఠాపురం నియోజకవర్గంలో మోంథా తుపాను సాయం అందలేదని చెబుతున్నారని, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని రైతులు, కౌలు రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై సీపీఐ, ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ నెల పదో తేదీన పిఠాపురంలో ఆందోళన చేపట్టనున్నట్టు తెలిపారు. బుధవారం పిఠాపురం మండలంలోని పలు గ్రామాల్లో సీపీఐ, రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, గత 18 నెలలగా చంద్రబాబు ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేసిందని, రైతులను రాజును చేయడమేమో కానీ, బికారిని చేయవద్దన్నారు. రైతుల అభివృద్ధికి పంచసూత్రాలను ప్రచారం చేస్తుందని, అదికారంలోకి వచ్చాక పంచ పాపాలు చేసి రైతులను దగా చేసిందని దుయ్యబట్టారు. ఖరీఫ్ సీజన్‌లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కనీసం గోనె సంచులను అందించడంలోనూ విఫలమైందని, తేమ శాతం పేరుతో అనేక ఆంక్షలు పెడుతున్నట్టు విమర్శించారు. తుపాను ప్రభావం నేపథ్యంలో కనీసం పంటను ఆరబెట్టుకోవడానికి, తడవకుండా కాపాడుకోవడానికి పట్టాలు కూడా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కొనుగోలు నిబంధనలు సడలించాలని కోరారు. మంత్రి నాదెండ్ల మనోహర్ పేపర్లకే పరిమితమయ్యారని, ఆచరణలో శూన్యమని విమర్శించారు. రైతులు ధాన్యాన్ని అయినకాడికి అమ్ముకుని నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మోంథా తుపానుతో రూ.5,500 కోట్లకు పైగా నష్టం జరిగితే, ప్రభుత్వ గణాంకాలు మాత్రం రూ.వెయ్యి కోట్లేనని చెబుతున్నాయన్నారు. ఎన్యూమరేషన్ పూర్తయి నెల రోజులైనా రైతులకు నష్ట పరిహారం అందించకపోవడం చంద్రబాబు ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. పంటల బీమా ప్రీమియం భారంగా ఉండటంతో రైతులు అందులో చేరలేకపోయారన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రబీ నుంచైనా ఉచిత పంటల బీమా అమలు చేయాలని కోరారు. ఈ పర్యటనలో ఇంకా సీపీఐ నాయకులు కె.బోడకొండ, తోకల ప్రసాద్, సాక రామకృష్ణ, సంఘం జిల్లా కన్వీనర్ నక్క శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


