రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో రత్నగిరి రద్దీగా మారింది. స్వామివారి ఆలయంతో పాటు వ్రత మండపాలు, క్యూలన్నీ భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని ఆలయాన్ని తెల్లవారుజామున 4 గంటలకు తెరచి పూజలు చేసి, వ్రతాల నిర్వహణ ప్రారంభించారు. అప్పటి నుంచే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. మధ్యాహ్నం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. స్వామివారిని సుమారు 30 వేల మంది దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు 2 వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి, శంకరులు ఎటువంటి వస్త్రాలంకరణ, కిరీటాలు, ఆభరణాలు లేకుండా నిజ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. రత్నగిరి వనదేవత వనదుర్మ అమ్మవారికి శుక్రవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ చండీ హోమం నిర్వహించనున్నారు. భక్తులు రూ.750 టికెట్టుతో ఈ హోమంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.


