నర్సును బలి చేశారు
తొలగింపు చర్యలు తగవన్న
ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్
కాకినాడ క్రైం: తుని ఏరియా ఆస్పత్రిలోని సర్జరీ ఘటనలో నర్సును బలి చేశారని, ఆమెను ఉద్యో గం నుంచి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నామని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు అన్నారు. యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ స్వామిబాబు ఆధ్వర్యంలో నాయకుల బృందం అధికారులను కలిసి ఆ చర్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. కలెక్టరేట్‌లో డీఆర్‌వో వెంకట్రావును కలిశారు. స్టాఫ్ నర్సుగా పద్మావతి పనిచేసిన 13 ఏళ్లలో మచ్చలేదన్నారు. డాక్టర్ల ఆదేశాల మేరకే నర్సులు పనిచేస్తారన్న విషయాన్ని డీఆర్‌వో దృష్టిలో పెట్టారు. ఆమె ఉద్యోగాన్ని తొలగించడం సరికాదన్నారు. విధి నిర్వహణలో ఆమె నిబద్ధత, కుటుంబ నేప థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఉద్యోగ తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. అనంతరం వైద్య, ఆరోగ్య సేవల జిల్లా సమన్వయాధికారి డాక్టర్ కె.మహేశ్వరరావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ బృందంలో ఏలేశ్వరం, జగ్గంపేట, తుని, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, పెదపూడి, ప్రత్తిపాడు, రౌతులపూడి, తాళ్లరేవు ఆస్పత్రి సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, ఈసీ సభ్యులు ఉన్నారు.
అడ్మిషన్లకు గడువు పెంపు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి టెన్త్, ఇంటర్మీడియెట్ అడ్మిషన్లకు ఈ నెల ఆరో తేదీ వరకూ గడువు పెంచినట్టు జిల్లా విద్యా శాఖాధికారి పిల్లి రమేష్ బుధవారం తెలిపారు. గతంలో రెగ్యులర్ పదో తరగతి ఓల్డ్ సిలబస్ రాసి ఫెయిలైన విద్యార్థులు ఓపెన్ స్కూల్ ద్వారా అడ్మిషన్ పొందవచ్చని చెప్పారు.


