ఖర్మాస్పత్రులు | - | Sakshi
Sakshi News home page

ఖర్మాస్పత్రులు

Dec 3 2025 7:31 AM | Updated on Dec 3 2025 7:31 AM

ఖర్మా

ఖర్మాస్పత్రులు

ఫ వైద్యానికి తాళాలు

ప్రభుత్వాస్పత్రుల్లో పడకేసిన వైద్యం

పిఠాపురం నియోజకవర్గంలో పీహెచ్‌సీలకు రాత్రి వేళ తాళాలు

సకాలంలో వైద్య సేవలందక ప్రాణాలు కోల్పోతున్న రోగులు

సీహెచ్‌సీలో సెక్యూరిటీ గార్డుతోనే వైద్య సేవలు

భయాందోళనలకు

గురవుతున్న ప్రజలు

పిఠాపురం: ఎవరైనా అస్వస్థతకు గురైతే ప్రతి క్షణం ఒక యుగంలా మారుతుంది. గోల్డెన్‌ అవర్స్‌లో వైద్యం అందితే నిండుప్రాణం నిలబడే చాన్స్‌ ఉంటుంది. అదే క్షణం ఆలస్యం చేస్తే ఆ ప్రాణదీపం కొడిగట్టిపోయే ప్రమాదం ఉంటుంది. కాస్త స్థితిమంతులైతే కార్పొరేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తారు. కానీ నిరుపేదలకు ప్రభుత్వ ధర్మాస్పత్రులే దిక్కు.

కానీ, నేడు అక్కడకు వైద్యం చేయించుకోవడానికి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యులు లేక వైద్యం అందకపోవడం ఒక ఎత్తయితే.. తీరా వెళ్లినా ఆస్పత్రులకు తాళాలు వేసి ఉండటంతో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న సంఘటన పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కలవరపెడుతోంది. 24 గంటలూ వైద్య సేవలందించాల్సిన పీహెచ్‌సీలు సాయంత్రం 4 గంటలు దాటితే చాలు.. మూత పడుతున్నాయి. ఈ నియోజకవర్గానికే పెద్దాస్పత్రి అయిన పిఠాపురం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌(సీహెచ్‌సీ)తో పాటు కొత్తపల్లి, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లోని పీహెచ్‌సీలు వైద్య సేవల్లో ప్రగతి చూపాల్సింది పోయి నానాటికీ దిగజారిపోవడం.. సేవా లోపాలతో వీటి ప్రతిష్ట మసకబారిపోవడం వంటి సంఘటనలు ఇటీవల చోటు చేసుకుంటున్నాయి. నిత్యం ఏదో ఒక అనర్థం జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడా లేని వైద్య సేవలు తీసుకొస్తున్నామంటూ పిఠాపురం ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చెప్పిన మాటలు నెరవేరతాయో లేదో తెలీదు కానీ, సరైన వైద్య సేవలందక రోగులు నిత్యం నరకం చూస్తున్నారు.

దిగజారిన సేవలు

● గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఉత్తమ వైద్య సేవలు అందించడం ద్వారా పిఠాపురం సీహెచ్‌సీ రాష్ట్ర స్థాయిలో అనేక అవార్డులు అందుకుంది. అటువంటి సీహెచ్‌సీ పరిస్థితి కొన్నాళ్లుగా దిగజారింది. ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకున్న బాలింతలకు ఇక్కడి వైద్యులు వణుకు పుట్టిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలో జరగాల్సిన ఆపరేషన్లను తూతూమంత్రంగా పూర్తి చేసి, కుట్లు వేసే పనిని ఎటువంటి శిక్షణ, అవగాహన లేని కింది స్థాయి సిబ్బందికి అప్పగిస్తున్నారు. దీంతో, ఆ కుట్ల వద్ద ఇన్ఫెక్షన్‌ వచ్చిందంటూ బాలింతలు, వారి బంధువులు గత సెప్టెంబర్‌లో ఆందోళన చేశారు.

● పిఠాపురం మండలం విరవకు చెందిన గర్భిణి ఉమామహేశ్వరి తొమ్మిది నెలలుగా ఈ ఆస్పత్రిలోనే వైద్య సేవలు పొందింది. తొమ్మిది నెలలు పూర్తవుతూండగా ఆస్పత్రికి వచ్చింది. పరీక్షలు నిర్వహించిన ఇక్కడి వైద్యురాలు సుజాత స్కానింగ్‌ చేయించి, రెండు రోజుల అనంతరం పురుడు కోసం కాకినాడ ఆస్పత్రికి వెళ్లాలని రిఫర్‌ చేశారు. కాకినాడ ఆస్పత్రిలో చేరిన తరువాత రెండు రోజుల క్రితమే బిడ్డ కడుపులోనే చనిపోయిందని అక్కడి వైద్యులు నిర్ధారించారు. వెంటనే ఆపరేషన్‌ చేసి, చనిపోయిన బిడ్డను బయటకు తీసి తల్లిని రక్షించారు.

● గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన నిండు గర్భిణి దొండపాటి శ్రీదుర్గ(25)కు వైద్యల పర్యవేక్షణలో పురుడు పోయాల్సి ఉంది. అయితే, వైద్యులు బలవంతంగా నార్మల్‌ డెలివరీ చేయడానికి ప్రయత్నించి, ఆమె మృతికి కారకులయ్యారని బంధువులు ఆరోపించి, ఆందోళనకు దిగారు.

● మరీ దారుణంగా పిఠాపురం సీహెచ్‌సీలో వైద్యులు చేయాల్సిన పనిని కాపలా కాసే సెక్యూరిటీ గార్డుతో చేయించడం రోగులను తీవ్రంగా కలవరపెట్టింది. ఏకంగా మార్చురీలో పోస్టుమార్టం కూడా సెక్యూరిటీ గార్డే చేయడం చూస్తేనే ఈ ఆస్పత్రిలో వైద్య సేవలు ఏవిధంగా దిగజారయో అర్థం చేసుకోవచ్చు.

● తాజాగా సోమవారం రాత్రి గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఇమంది మాణిక్యం అనే వ్యక్తి అస్వస్థతకు గురవగా స్థానికులు చేబ్రోలు పీహెచ్‌సీకి తరలించారు. ఆస్పత్రికి తాళాలు వేసి ఉండటంతో 108కి ఫోన్‌ చేశారు. అది కూడా గంట అయినా రాకపోవడంతో సకాలంలో వైద్యం అందక మాణిక్యం మృతి చెందాడు.

● ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రులపై పర్యవేక్షణ పెంచి, పూర్తి స్థాయిలో వైద్యులను, సిబ్బందిని నియమించి ఉంటే రోగుల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితి ఉండేది కాదని పలువురు అంటున్నారు.

ఖర్మాస్పత్రులు1
1/1

ఖర్మాస్పత్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement