‘విజనరీ’ పాలనలో ఆర్థిక పరిస్థితి తిరోగమనం
కాకినాడ రూరల్: విజనరీ చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తిరోగమనంలో ఉందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. చంద్రబాబు పరిపాలిస్తున్నది ఆంధ్రప్రదేశ్‌నా లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా అనే అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి గతి తప్పిందని, దాన్ని గాడిలో పెట్టాలంటే సంపద సృష్టించాలని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు భారీగా పెరిగిన విషయం కాగ్ నివేదికలో వెల్లడైందన్నారు, 2025–26 ఆర్థిక సంవత్సరం రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తే అది అక్టోబర్ నాటికే రూ.47 వేల కోట్లు దాటిందని వివరించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో రూ.3.31 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేస్తే.. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం 18 నెలలకే రూ.2.5 లక్షల కోట్ల అప్పు చేసిందని తెలిపారు. రానున్న మూడున్నరేళ్లలో ఇంకెంత అప్పు చేస్తారోనని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో జీఎస్టీ, కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్నుల వసూళ్లు తగ్గాయని తెలిపారు. అధికారంలోకి రావడానికి కల్లబొల్లి మాటలు చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు రాష్ట్రాన్ని దివాలా తీయించేలా వ్యవహరిస్తున్నారని నాగమణి ధ్వజమెత్తారు.
కార్తిక ఆదాయం
రూ.1.05 కోట్లు
సామర్లకోట: కార్తిక మాసంలో పంచారామ క్షేత్రానికి రూ.1,05,75,051 ఆదాయం వచ్చినట్లు ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. దేవదాయ శాఖ తనిఖీదారు వడ్డీ ఫణికుమార్ ఆధ్వర్యాన ఆలయంలో మంగళవారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. హుండీల ద్వారా రూ.22,37,942, దర్శనం టికెట్ల ద్వారా రూ.36,29,398, కానుకలు రూ.38,015, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.12,86,855, ఆర్జిత సేవల ద్వారా రూ.3.20 లక్షలు, స్వామి వారి ఫొటోల విక్రయం ద్వారా రూ.11,540, ఆన్‌లైన్ విరాళాలు రూ.7,94,876, అన్నదాన విరాళాలు రూ.22,29,398 చొప్పున ఆదాయం వచ్చిందని ఈఓ వివరించారు. కార్యక్రమంలో ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహన్‌రావు, సభ్యులు, ఉత్సవాల ప్రత్యేకాధికారి కె.సూర్యనారాయణ, సామర్లకోట రెవెన్యూ సిబ్బంది, శ్రీసత్యదుర్గ హరిహర సేవా సంఘం, జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం, సామర్లకోట శ్రీరామ సేవా సంఘం, భక్త సంఘం సభ్యులు పాల్గొన్నారు.
రైతులను అయోమయంలోకి నెట్టిన పవన్
వైఎస్సార్ సీపీ
రాష్ట్ర రైతు విభాగం
అధ్యక్షుడు జున్నూరి
మలికిపురం: డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ రాజోలు నియోజకవర్గ పర్యటన ఇక్కడి రైతులను అయోమయంలోకి నెట్టిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి రామారావు (బాబి) అన్నారు. మంగళవారం ఆయన కేశనపల్లిలో రైతులు, పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడుతూ శంకరగుప్తం మేజర్ డ్రైన్ మరమ్మతుల పనులను రూ.22.62 కోట్లతో అధికారులు ఆమోదించి, ఫైనాన్స్ కమిషన్‌కు పంపారని, ఇక నిధులు మంజూరవుతాయని రైతులు భావిస్తున్న సమయంలో ఆ క్రెడిట్ పవన్ ఖాతాలో పడుతుందనే ఉద్దేశంతో ఎవరో ఆ ఫైల్ తొక్కి పెట్టారని తాము భావిస్తున్నామన్నారు. పవన్ తన పర్యటనలో అసలు ఈ నిధులు వస్తాయని కానీ రావని కాని చెప్పలేదన్నారు. 45 రోజుల సమయం అంటూ సమస్యను మొదటికి తీసుకెళ్లే విధంగా పవన్ వ్యాఖ్యానించారని బాబి అన్నారు. శంకరగుప్తం డ్రైన్ మరమ్మతులు మొదటి నుంచి చివరి వరకూ ఒకేసారి చేస్తేనే ప్రయోజనం ఉంటుందన్నారు. ఇలా పలు భాగాలుగా నిర్వహిస్తే ప్రయోజనం ఉండదని నివేదికలు చెబుతుండగా రూ.22.62 కోట్లతో ఒక భాగం మరమ్మతులకు ప్రతిపాదించడం తగదన్నారు. ఇంకా నిధులు పెంచి డ్రైన్ అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త తరహా రాజకీయాలు చేస్తానని చెప్పే పవన్ 2019లో వైఎస్సార్ సీపీని ఈ సమస్యలపై ఎందుకు అడగలేదని రైతులను ప్రశ్నిస్తూ మూస రాజకీయాలనే చేస్తున్నారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎక్స్‌పర్ట్ కమిటీ నివేదిక ద్వారా రూ.3,320 కోట్లతో కోనసీమలో ఇరిగేషన్ ఆధునీకరణ పనులు ప్రారంభించగా 30 శాతం పూర్తయ్యాయని చెప్పారు. వైఎస్సార్ మరణానంతరం టీడీపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేదన్నారు. ఆయన వెంట నాయకులు గుబ్బల రమేష్, ఇందుకూరి సత్యనారాయణరాజు, దొంగ నాగ సత్యనారాయణ, యెనుముల నారాయణస్వామి ఉన్నారు.
‘విజనరీ’ పాలనలో ఆర్థిక పరిస్థితి తిరోగమనం


