ప్రాణం పోసే చోటే ప్రాణాలు పోతున్నాయి
వైద్య వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం పట్టించకోవడం మానేసింది. ప్రభుత్వాస్పత్రికి వెళ్తే ప్రమాదమనే భయాందోళనలను ప్రజల్లో కలిగించింది. ఇటీవల జరిగిన అన్ని సంఘటనల్లోనూ ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. పర్యవేక్షణ కొరవడటంతో ప్రభుత్వాస్పత్రుల్లోని కొంత మంది వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి నిరుపేదలు ఆస్పత్రికి వస్తే వైద్యుల నిర్లక్ష్యం వారి ప్రాణాలు తీస్తోంది. ప్రాణాలు నిలపాల్సిన ఆస్పత్రిలోనే ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేకపోవడం చాలా దారుణం. 24 గంటలూ వైద్యం అందాల్సిన పీహెచ్‌సీలకు తాళాలు వేయడం చూస్తేనే వైద్య సేవలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోంది. ఈ విషయాలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. చర్యలు తీసుకోపోతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతాం. వైద్యులు చేయాల్సిన పనిని సెక్యూరిటీ గార్డులతో చేయించడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే. ఈ సంఘటనలపై విచారణ జరిపించాలి. పేదలకు మెరుగైన వైద్యం అందించాలి.
– వంగా గీతా విశ్వనాథ్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, పిఠాపురం


