గుర్తుతెలియని మృతదేహం స్వాధీనం
ఆలమూరు: మండలంలోని జొన్నాడ రావులపాలెం మధ్య ఉన్న గౌతమీ గోదావరి నదిలో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆలమూరు ఎస్సై జి.నరేష్ కథనం ప్రకారం గోదావరి మధ్యలో సుమారు 50 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం స్థానికుల కంటపడింది. వారు ఇచ్చిన సమాచారంతో రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ నేతృత్వంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మూడు రోజుల క్రితమే మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు నీలం రంగ నిక్కరు, బనియను ధరించి ఉన్నాడు. అతనికి ఎడమ చేయి లేదు. కాళ్లు, చేతి వేళ్లు కొరికినట్టు ఉన్నాయి. ఈ మృతదేహాన్ని జంతువులు కొరికివేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మండపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
4న వాలీబాల్ ఎంపికలు
అమలాపురం టౌన్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన రాజమహేంద్రవరం ఆర్ట్స్ క్రీడా మైదానంలో జూనియర్స్ బాలుర, బాలికల ఎంపికలు జరుగుతాయని ఉమ్మడి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి కుంచె యశ్వంత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్ట్స్ మైదానంలో డాక్టర్ పరి మి రామచంద్రరావు మెమోరియల్ వాలీబాల్ కో ర్టులో ఈ ఎంపిక పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. జూనియర్స్ కేటగిరిలో పాల్గొనే బాల బాలికలు 2008 జనవరి 1వ తేదీ తర్వాత పుట్టినవారు ఈ పోటీలకు అర్హులు. ఈనెల 4వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఎంపికలు జరుగుతాయని తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డును సమర్పించాలని సూచించారు. వివరాలకు 99595 07330, 92472 59703 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని యశ్వంత్ విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ సిబ్బందిపై దాడి
చేసిన ఇద్దరిపై కేసు
కోటనందూరు: ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేసిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తుని నుంచి నర్సీపట్నం బస్సు బయలుదేరింది. తుని మండలం రేఖవానిపాలెంలో దిగేందుకు దిమిటి రాజు డబ్బులిచ్చి టిక్కెట్ ఇమ్మని కండక్టర్ సలాది వరలక్ష్మిని అడిగాడు. చిల్లర లేదని ఫోన్ పే చేయమని కండక్టర్ చెప్పడంతో వాగ్వాదానికి దిగాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన బస్సు డ్రైవర్‌ను కాలర్ పట్టుకుని తోసేశాడు. రేఖవానిపాలెంలో బస్సు దిగిపోయిన దిమిటి రాజు కొంతమంది యువకులతో కలిసి కోటనందూరు సెంటర్లో బస్సును అడ్డగించి డ్రైవర్‌పై దాడి చేశాడు. ఇద్దరినీ ప్రయాణికులు విడదీయడంతో నర్సీపట్నంలో నీ సంగతి చూస్తామంటూ హెచ్చరించి వెళ్లిపోయారు. దీనిపై కండక్టర్ సలాది వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.


