ఆధ్యాత్మికత.. సేవా తత్పరత
రాయవరం: మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని ఆచరిస్తూ సత్యసాయి సేవా సంస్థలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నాయి. ఆకలి అనేవారికి పట్టెడన్నం పెట్టడంతో పాటు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుంటున్నాయి. ఏటా నవంబర్ 23న సత్య సాయిబాబా జయంతిని నిర్వహిస్తుండగా, ఈ ఏడాది శత జయంతి ఉత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు సత్యసాయి సేవా సమితులు ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం జోన్ల పరిధిలో 120 సత్యసాయి సేవా సమితులు, 252 భజన మండళ్లు ఉన్నాయి. వీటి ద్వారా భారతీయ సంస్కతీ సంప్రదాయాలు పరిఢవిల్లేలా అన్ని పర్వదినాలను నిర్వహిస్తున్నారు. అన్ని మతాలను ఒకటిగా చేర్చి సనాతన ధర్మాన్ని సత్యసాయి సేవా సంస్థలు విస్తరిస్తున్నాయి. సత్యసాయి సేవా సంస్థల ద్వారా నగర సంకీర్తనలు, నామ సంకీర్తనలు, సామూహిక పూజలు, యజ్ఞాలు, క్రతువులు, లిఖిత నామ జపం, వ్యక్తిగత సాధనలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు. సత్యసాయి సేవా సంస్థల విద్యా విభాగంలో భాగంగా 350 బాల వికాస్‌లను నిర్వహిస్తున్నారు. బాలవికాస్ ద్వారా విద్యార్థులకు ఆధ్యాత్మికత, విజ్ఞానంతో పాటు ప్రధానంగా మానవతా విలువలను ప్రబోధిస్తారు. గ్రూపు 1, 2, 3 తరగతులుగా నిర్వహించే బాల వికాస్‌లలో సుమారు 15 వేల మంది బాలబాలికలు సభ్యులుగా ఉన్నారు. 534 మంది బాలవికాస్ గురువులు వీరికి విద్యా బోధన చేస్తున్నారు.
ఏడాది పొడవునా..
ఫ సత్యసాయి సేవా సంస్థల పరిధిలో ఏటా పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేస్తున్నారు. అలాగే ఫీజులు, బస్ పాస్‌ల రూపంలో ఏటా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. రావులపాలెంలోని కంప్యూటర్ సెంటర్ ద్వారా ఏటా 200 మందికి ఉచితంగా కంప్యూటర్ విద్యనందిస్తున్నారు.
ఫ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టుశిక్షణ కేంద్రాల ద్వారా పేద మహిళలకు బాసటగా నిలుస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా వారి ఆర్థిక పరిపుష్టికి సహకరిస్తున్నారు. ఈ ఏడాది 500 మంది వరకూ జ్యూట్ బ్యాగ్‌ల తయారీలో శిక్షణ పొందారు. జిల్లాకు చెందిన 100 మందికి పుట్టపర్తిలో జ్యూట్ కుట్టు మెషీన్లు అందజేశారు. అంతేకాకుండా 2013 అక్టోబర్ నుంచి నెల నెలా ఎంపిక చేసిన ఆరోగ్య కేంద్రాల్లో నెలకు దాదాపు 3 వేల మంది గర్భిణులకు కాల్షియం టాబ్లెట్లు, ఫోలిక్ యాసిడ్, ఐరన్ కాంబినేషన్ సిరప్‌లు, మల్టీ విటమిన్ సిరప్‌తో కూడిన హెల్త్ కిట్లను అందజేస్తున్నారు. ప్రతి నెలా 19న గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. రోజూ నిడదవోలు, కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉండి చికిత్స పొందే రోగులకు సహాయకులుగా వచ్చేవారికి ఉచితంగా భోజనం వడ్డిస్తున్నారు.
ఆరోగ్యానికి ప్రాధాన్యం
సత్యసాయి సేవా సంస్థల పరిధిలో పేదల కోసం అల్లోపతి, హోమియో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. రోజూ, వారం వారీగా వైద్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. అనాథ పిల్లల (బాలురు) కోసం తాటిపాక, రావులపాలెం, ఊబలంకల్లో అనాథాశ్రమాలు నెలకొల్పారు. అదేవిధంగా తాటిపాక, రావులపాలెం, వడ్లమూరుల్లో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేశారు. రావులపాలెం, ఊబలంకల్లో ఏర్పాటు చేసిన బధిరుల ఆశ్రమంలో 33 మందికి ఆశ్రయం కల్పిస్తున్నారు. మారేడుమిల్లిలో ప్రతి నెలా గిరిజనులకు ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు.
నగర సంకీర్తన చేస్తూ..
లోక కల్యాణం కోసం రోజూ గ్రామాల్లో సత్యసాయి సేవా సంస్థలు ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్నాయి. వేకువ జామునే గ్రామాల్లో సత్యసాయి భజనలను ఆలపిస్తూ నగర సంకీర్తన చేస్తున్నారు. నగర సంకీర్తన ద్వారా గ్రామస్తులను మేల్కొలపడం, భక్తిభావాన్ని పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం.
ఫ నిరంతరాయంగా
సత్యసాయి సేవా కార్యక్రమాలు
ఫ ఉమ్మడి జిల్లాలో 120 సమితులు,
252 భజన మండళ్లు
ఫ 23న సత్య సాయిబాబా
శత జయంతి వేడుకలు
బాబా అనుగ్రహంగా భావిస్తూ..
జిల్లాలో సత్యసాయి సేవా సంస్థలు సేవాభావంతో పనిచేస్తున్నాయి. మానవ సేవే మాధవ సేవగా భావించడమే సేవా సంస్థల పరమావధి. ఇది బాబా అనుగ్రహంగా భావిస్తున్నాం. అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం.
–బులుసు వెంకటేశ్వర్లు, సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు, తూర్పుగోదావరి జిల్లా
నైతిక విలువలు నేర్పుతూ..
సత్యసాయి సేవా సంస్థలో బాలవికాస్ గురువుగా పనిచేస్తున్నాను. చిన్నారులకు ఆధ్యాత్మికత, నైతిక విలువలు నేర్పడం బాలవికాస్ ముఖ్య ఉద్దేశం. 35 ఏళ్లుగా సత్యసాయి సేవాసంస్థలో పనిచేస్తున్నాను.
–ఆకెళ్ల సీతామహాలక్ష్మి, గురువు, బాలవికాస్, దంగేరు, కె.గంగవరం మండలం
ఆధ్యాత్మికత.. సేవా తత్పరత
ఆధ్యాత్మికత.. సేవా తత్పరత
ఆధ్యాత్మికత.. సేవా తత్పరత
ఆధ్యాత్మికత.. సేవా తత్పరత


