నిత్యం తల్లిచుకునేలా..
● ర్యాలిలో అమ్మకు మందిరం నిర్మించిన మ్యాజిక్ ఫ్యామిలీ
సృష్టిలో ప్రతి ప్రాణికి మూలం ‘అమ్మ’.. అందుకే తల్లిని మించిన దైవం లేదని అంటారు. అటువంటి తల్లికి ఏకంగా ఆరాధ్య మందిరమే నిర్మించి, ప్రేమను చాటుకున్నారు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన డాక్టర్ చింతా శ్యామ్‌కుమార్. ర్యాలి మండల ప్రజా పరిషత్ మోడల్ ప్రైమరీ పాఠశాల హెచ్‌ఎం అయిన శ్యామ్‌కుమార్ మ్యాజిక్ ప్రదర్శనలతో ఇంద్రజాలకుడిగా ప్రసిద్ధి చెందారు. సమాజంలో పేదలు, అనాథలకు అల్పాహారం, ఆహారం అందిస్తూ సేవ చేస్తున్నారు. ఈ సేవలకు స్ఫూర్తి తన తల్లి నాగ వీరమణి స్ఫూర్తి అని శ్యామ్ చెబుతున్నారు. ర్యాలిలో ఎన్నో ఏళ్లుగా ఆమె ఆధ్వర్యంలో ప్రతి శనివారం సుమారు 300 నుంచి 400 మందికి అల్ఫాహారం, కుటుంబ ఆధారం లేని వృద్ధులు, పేదలు సుమారు 30 మందికి ప్రతి రోజు భోజనం వండి వడ్డిస్తూ వచ్చారు. గత ఏడాది నవంబరు 18న ఆమె గుండెపోటుతో మృతి చెందారు. ఆమె స్ఫూర్తితో మ్యాజిక్ ఫ్యామిలీ ఆయా సేవలను కొనసాగిస్తుంది. అన్నపూర్ణా డే కేర్ హోమ్ ద్వారా పేదల ఆకలి తీరుస్తూ, విద్య, వైద్య సేవలు చేస్తున్నారు. అమ్మ సేవలు శాశ్వతంగా కొనసాగించాలని శ్యామ్ ర్యాలి గ్రామంలో తమ రెండిళ్లకు మధ్య ఉన్న స్థలంలో అమ్మకు ప్రత్యేక మందిరం నిర్మించారు. తమిళనాడులో ఓ ప్రముఖ శిల్పిచే నాగ వీరమణి విగ్రహాన్ని తయారు చేయించారు. ఆ విగ్రహాన్ని ఆ మందిరంలో ప్రతిష్ఠించారు. ఆదివారం అన్నపూర్ణ డే కేర్ హోమ్ ద్వారా లబ్ధి పొందుతున్న తల్లుల చేతుల మీదుగా ఆ మందిరాన్ని ప్రారంభించారు. ఆమె విగ్రహం వద్ద ‘అమ్మ’ అక్షర రూపంలో సహస్ర జ్యోతులతో నివాళులర్పించారు. అనంతరం తన తల్లి జీవితంపై రూపొందించిన ఐదు పాటలను విడుదల చేశారు. మ్యాజిక్ ఫ్యామిలీ సభ్యులు అన్నపూర్ణ, డాక్టర్ మోహిత్, డాక్టర్ సీత, తేజశ్రీ శ్రీకాంత్, రుషిత్, జాన్విక, డాక్టర్ సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
– కొత్తపేట


