రేపు జాబ్ మేళా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఉపాధి కార్యాలయంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి జి.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డెక్కన్ ఫైన్ కెమికల్స్‌లో 100 ట్రైనీ కెమిస్ట్ పోస్టులకు, అపోలో ఫార్మసీలో 50 ఫార్మా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని వివరించారు. పదో తరగతి, ఆపైన ఉత్తీర్ణులైన విద్యార్థులు దీనికి హాజరు కావచ్చన్నారు. వివరాలకు 86398 46568 నంబరులో సంప్రదించాలని సూచించారు.
అతిథి అధ్యాపకులకు
ఇంటర్వ్యూలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకాలకు ఈ నెల 18, 19 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కె.ఆంజనేయులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18వ తేదీన సంస్కృతం, ఇంగ్లిష్, స్టాటిస్టిక్స్, చరిత్ర; 19వ తేదీన కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, కామర్స్, మేనేజ్‌మెంట్, పీజీ ఫిజికల్ కెమిస్ట్రీ, పీజీ అనలటికల్ కెమిస్ట్రీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని వివరించారు. పీజీలో 55 శాతం ఉత్తీర్ణతతో పాటు నెట్ లేదా సెట్ పాసైన వారు అర్హులని, వివరాలకు 96520 23082 నంబరులో సంప్రదించాలని కోరారు.
గుళ్లపల్లికి ఘనసమ్రాట్
బిరుదు ప్రదానం
రాజమహేంద్రవరం రూరల్: వేదవిద్యా పరిరక్షణకు, వేదవిద్యా వ్యాప్తికి ఎనలేని కృషి చేస్తున్న శ్రీ దత్తాత్రేయ వేదవిద్యా గురుకులం వ్యవస్థాపక అధ్యక్షుడు గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠిని పలువురు వక్తలు కొనియాడారు. సీతారామచంద్ర ఘనపాఠి దంపతులను ఆయన షష్టి పూర్తి సందర్భంగా గురుకులంలో ఆదివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి మాట్లాడుతూ, ఎందరో ఘనపాఠులను తయారు చేయడమే కాకుండా, ఇటీవలి కాలంలో సంపూర్ణ ఘన పారాయణ నిర్వహించిన ఖ్యాతి గుళ్లపల్లికి దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ‘ఘనసమ్రాట్’ బిరుదు ప్రదానం చేశారు. కాకినాడకు చెందిన ఉప్పులూరి గణపతిశాస్త్రి వేదశాస్త్ర పరిషత్ ఆధ్వర్యంలో సాంగవేదార్థ రత్నాకర, రాచకొండ తెన్నేటి వేదశాస్త్ర పరిషత్ ఆధ్వర్యాన ‘వేదధర్మ మహా యశస్వి బిరుదులతో సత్కరించారు. తనకు జరిగిన సత్కారాలకు సీతారామచంద్ర ఘనపాఠి కృతజ్ఞతలు తెలిపారు. వేద పరిరక్షణతోనే సర్వజగద్రక్షణ జరుగుతుందని, యావత్తు విశ్వానికి వేదం సుఖశాంతులు ప్రసాదించగలదని అన్నారు. కార్యక్రమంలో గుళ్లపల్లి దత్తాత్రేయ ఘనపాఠి, గురుకులం కార్యదర్శి, భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు, సాహితీవేత్త యర్రాప్రగడ రామకృష్ణ, నగర ప్రముఖులు దాట్ల బుచ్చి వెంకటపతిరాజు, పలువురు వేదశాస్త్ర విద్వాంసులు పాల్గొన్నారు.


