సోమవారం శ్రీ 17 శ్రీ నవంబర్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 17 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

Nov 17 2025 8:32 AM | Updated on Nov 17 2025 8:46 AM

నిర్లక్ష్యంగా వ్యవహరించారు

శ్రీ కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీస్‌ ప్రతినిధులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎంఓయూ కుదుర్చుకునేందుకు ఆస్పత్రికి రావాల్సి ఉండగా ఐదు మెమోలు పంపినా రాలేదు. చివరకు నెల రోజులు గడిచాక వచ్చి ఎంఓయూ చేసుకుని వెళ్లారు. సెక్యూరిటీ నిర్వహణ అత్యంత అధ్వానంగా ఉంది. రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. అగ్రిమెంట్‌ ప్రకారం మ్యాన్‌పవర్‌ ఇవ్వడం లేదు. దీనిపై డీఎంఈకి లెటర్‌ రాశాం. వీళ్ల స్పందన ఏమాత్రం సరిగా లేదని స్పష్టం చేశాం. ఇదే పంథా కొనసాగితే జీతాలకు సంతకాలు చేయలేమని చెప్పాం. సమావేశానికి రావాలని పిలిచినా యాజమాన్యం వచ్చేది కాదు. అధ్వాన నిర్వహణకు పెనాల్టీ వేస్తామని చెప్పాం.

– డాక్టర్‌ లావణ్యకుమారి,

సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌, కాకినాడ

డీఎంఈకి ఫిర్యాదు చేశాం

సెక్యూరిటీ లోపాల కారణంగానే కళాశాలలో కలప దొంగతనం జరిగింది. డిపార్టుమెంట్ల ఏసీలలో కాపర్‌ వైర్లు కూడా దొంగిలించారు. వివరణ కోరేందుకు పిలిచినా కనీసం స్పందించడం లేదు. సిబ్బంది తమ జీతాల విషయంలోనూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనధికార కోతలు విఽధిస్తున్నారని తెలిసింది. ఈ సమస్యలపై హైదరాబాద్‌లో ఉంటున్న యాజమాన్యం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తూ సెక్యూరిటీ కాంట్రాక్టర్‌ నిర్లక్ష్య వైఖరిపై డీఎంఈకి ఫిర్యాదు చేశాం.

– డాక్టర్‌ ఎ.విష్ణువర్ధన్‌, ప్రిన్సిపాల్‌,

రంగరాయ వైద్య కళాశాల

ఇదేం రక్షణ?

కాకినాడ క్రైం: భద్రతాపరమైన లోపాలపై ఎన్ని అధికారులు సూచనలు, ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోరు. పార్కింగ్‌ నుంచి భద్రత, రద్దీ నిర్వహణను గాలికొదిలేస్తున్నారు. దొంగతనాలు జరుగుతున్నా పట్టింపే లేదు. ఫలితంగా రోగులు, వారి బంధువులు నరకయాతన అనుభవిస్తున్నారు. నిత్యం వేలాది మంది వస్తున్న కాకినాడ జీజీహెచ్‌లో సెక్యూరిటీ కాంట్రాక్టు సంస్థ అనుసరిస్తున్న వైఖరిపై అధికారులు కన్నెర్ర చేస్తున్నారు. చెప్పిచెప్పి విసిగిపోయిన అధికారులు ఈ సంస్థ తీరుపై వైద్య విద్య సంచాలకుడి(డీఎంఈ)కి ఫిర్యాదు చేశారు.

ఆది నుంచీ వివాదాలు

జీజీహెచ్‌లో సెక్యూరిటీ నిర్వహణను హైదరాబాద్‌కు చెందిన శ్రీ కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీస్‌ ఈ ఏడాది జూన్‌ నుంచి నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో లైంగిక వేధింపుల ఘటనలో కీలక నిందితుడిగా పేరు వినిపిస్తున్న ఓ వ్యక్తిని ఇక్కడ సెక్యూరిటీ పర్యవేక్షకుడిగా నియమించారు. దీనిపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా సెక్యూరిటీ గార్డులు, మహిళా సిబ్బంది, రోగులతో పాటు వేల మంది మహిళలు వచ్చే జీజీహెచ్‌లో అటువంటి వ్యక్తిని ఎందుకు నియమించారని ప్రశ్నించినా ఆ సంస్థ యాజమాన్యం స్పందించలేదని చెబుతున్నారు.

5 నెలల్లో 37 దొంగతనాలు

గడచిన ఐదు నెలల కాలంలో రంగరాయ వైద్య కళాశాల (ఆర్‌ఎంసీ), జీజీహెచ్‌లలో మొత్తం 37 దొంగతనం కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా ద్విచక్ర వాహన కేసులు, తరువాతి స్థానంలో సెల్‌ఫోన్‌ చోరీలు ఉన్నాయి. మరికొందరు బాధితులు ఆసుపత్రుల్లో తమ డబ్బు, బంగారాన్ని కూడా పోగొట్టుకున్నారు. వైద్యులే తమ బైకులు, సెల్‌ఫోన్లు పోయి లబోదిబోమన్నారు. ఆర్‌ఎంసీలో అయితే చెట్టు నరికి, కలప తరలించుకుపోయిన ఘటన రాష్ట్ర స్థాయిలోనే వివాదాస్పదమైంది. ఈ సంఘటనలో ఓ ప్రభుత్వ ఉద్యోగితో పాటు ఇద్దరు అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది సస్పెండ్‌ అయ్యారు కూడా. దీనిపై విచారణ నిర్వహించిన కమిటీ కలప దొంగతనానికి భద్రతా లోపమే ప్రధాన కారణమని తేల్చింది.

పార్కింగ్‌ అస్తవ్యస్తం

జీజీహెచ్‌కు రోజూ సుమారు 3 వేల నుంచి 3,500 మంది రోగులు వస్తూంటారు. వీరిలో కనీసం 1,500 మంది ఇన్‌పేషెంట్లు ఉంటారు. ఆసుపత్రి గణాంకాల ప్రకారం కనీసం 2 వేల నుంచి 2,500 వాహనాలు జీజీహెచ్‌కు వస్తూంటాయి. వీటి కోసం ఆస్పత్రిలో అనేక చోట్ల పార్కింగ్‌ ఏర్పాట్లు ఉన్నాయి. అయినప్పటికీ పార్కింగ్‌ నిర్వహణ అస్తవ్యస్తంగా సాగుతోంది. వాహనాన్ని లోపలకు తీసుకుని వెళ్లడం, బయటకు తీసుకుని రావడం గగనమవుతోంది. పలు వాహనాలను ఆస్పత్రి బయటే వదిలి రమ్మని చెబుతున్నారు. దీంతో, ఆ వాహనాలు రోడ్డుపై ట్రాఫిక్‌కు ఇబ్బందికరంగా మారుతున్నాయి. పోలీసులు సైతం ఈ సమస్యను జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌కు వివరించి లోపలే పార్కింగ్‌ ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ విషయాన్ని కాంట్రాక్టు సంస్థకు చెప్పినా ఫలితం లేకపోయింది. పార్కింగ్‌లో వరుసల నిర్వహణ లేక రోగులు వారి సహాయకులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో చిక్కుకున్న ఓ హృద్రోగ బాధితుడు గత గురువారం వరుసలో ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో అక్కడి వారు సపర్యలు చేసి కాపాడారు.

జీతాల్లో దోపిడీ

ఎండయినా వానయినా, నీరసంగా ఉన్నా సెక్యూరిటీ గార్డులు గంటలకొద్దీ అవిశ్రాంతంగా నిలుచుని విధులు నిర్వహిస్తూంటారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సెక్యూరిటీ గార్డులకు నెలకు రూ.18,600, సూపర్‌వైజర్లకు రూ.21,506 చొప్పున వేతనాలు ఇవ్వాలి. పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి మినహాయింపులు పోనూ ఉద్యోగుల చేతికి అందాల్సిన నికర మొత్తాలు వరుసగా రూ.13,960, రూ.16,141. కానీ, ఇక్కడే గోల్‌మాల్‌ జరుగుతోందని, గార్డులకు రూ.1,861 తగ్గించి రూ.12,099, సూపర్‌వైజర్లకు రూ.2,241 కోత పెట్టి రూ.13,900 మాత్రమే ఇస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. జీజీహెచ్‌లో అన్ని క్యాడర్లూ కలిపి 253 మంది సెక్యూరిటీ సిబ్బంది పని చేయాల్సి ఉండగా 230 మంది మాత్రమే ఉన్నారు. కానీ, 253 మంది ఉన్నట్లు చూపించి జీతాలు డ్రా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. 230 మందిలో 10 మంది సూపర్‌వైజర్లు, 220 మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. ఈ లెక్కన సెక్యూరిటీ గార్డుల జీతాల నుంచి రూ.4,09,420, సూపర్‌వైజర్ల నుంచి రూ.22,410, అలాగే లేకుండానే ఉన్నట్లు చూపుతున్న 23 మంది సూపర్‌వైజర్‌ పోస్టుల పేరుతో రూ.3,19,700 కలిపి ప్రతి నెలా రూ.7,51,530 స్వాహా చేస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. ఇటువంటి ఇబ్బందులపై జీజీహెచ్‌ అధికారులు ప్రశ్నిస్తున్నా సంస్థ నుంచి స్పందన లేదని చెబుతున్నారు. విషయాన్ని స్థానిక నేతలకు చెప్తే.. వారిని సైతం పట్టించుకోవడం లేదని, తమకు రాష్ట్ర నేతలతో నేరుగా సంబంధాలున్నట్టు చెబుతున్నారని అంటున్నారు.

జీజీహెచ్‌ సెక్యూరిటీ కాంట్రాక్టు

సంస్థపై అధికారుల అసంతృప్తి

ఆదేశాలు ధిక్కరిస్తున్నారని ఆగ్రహం

అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపణలు

డీఎంఈకి ఫిర్యాదు

సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన

సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న జీజీహెచ్‌ సెక్యూరిటీ గార్డులు కొద్ది రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని యాజమాన్యాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. జీఓ ప్రకారం జీతాలివ్వాలని, ఓవర్‌ టైం పెండింగ్‌ బకాయిలు విడుదల చేయాలని, క్యాజువల్‌ లీవులు ఇచ్చి నిర్ణీత సెలవుల కంటే తక్కువ తీసుకున్న వారు పని చేసిన రోజులకు జీతాలివ్వాలని, నిరంతరం నిల్చుని సేవలందించే తమకు ఆరోగ్య భద్రత కల్పించాలని, శీతాకాలం విధుల నిర్వహణకు కోట్లు అందించాలని, మహిళల సహజ సమస్యలకు అనుగుణంగా కుర్చీలు కేటాయించాలని, పీఎఫ్‌ చెల్లింపులు పూర్తిగా నిలిపివేశారని, దీనిపై స్పష్టత ఇచ్చి పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. యూనిఫాం కుట్టు కూలి కూడా ఇవ్వలేదని వాపోతున్నారు.

సోమవారం శ్రీ 17 శ్రీ నవంబర్‌ శ్రీ 20251
1/4

సోమవారం శ్రీ 17 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

సోమవారం శ్రీ 17 శ్రీ నవంబర్‌ శ్రీ 20252
2/4

సోమవారం శ్రీ 17 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

సోమవారం శ్రీ 17 శ్రీ నవంబర్‌ శ్రీ 20253
3/4

సోమవారం శ్రీ 17 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

సోమవారం శ్రీ 17 శ్రీ నవంబర్‌ శ్రీ 20254
4/4

సోమవారం శ్రీ 17 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement