
చూసిన కనులదే భాగ్యం!
● వైభవంగా వాడపల్లి వెంకన్న
బ్రహ్మోత్సవాలు
● 3వ రోజు స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు
కొత్తపేట: కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో శ్రీ, భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడోరోజు తిరువీధుల్లో శ్రీవారి విహార ఘట్టం కన్నుల వైకుంఠంగా సాగింది. శ్రీవారు కోదండరాముని అలంకరణలో హనుమద్వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు ఈ వాహన సేవను వీక్షించారు. భక్తుల గోవింద నామస్మరణతో వాడపల్లి క్షేత్రం మార్మోగింది. ఖండవిల్లి రాజేశ్వరవరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చక బృందం స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యహవాచనం, పంచామృత మండపారాధన, మహాస్నపనము, ప్రధాన హోమాలు, దుష్ట్రగహ పరిహారార్థం మహాసుదర్శన హోమం, తోమాల సేవ, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి స్వస్తివచనం, ప్రధాన హోమాలు, స్వామివారికి విశేషార్చన, చతుర్వేద స్వస్తి, దిగ్దేవతా బలిహరణ, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించారు. దేవస్థానం తరపున డీసీ అండ్ ఈఓ చక్రధరరావు దంపతులు, ఉత్సవ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు.
హనుమద్వాహనంపై శ్రీవారి విహారం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు కోదండరామ అలంకరణలో హనుమద్వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి హనుమద్వాహనంపై స్వామివారిని అలంకరించగా మాడ వీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారిని కోదండరాముని అవతారంలో అలంకరించి, హనుమంత వాహనంపై ఊరేగించడం ఆనవాయితీ. ఈ ఘట్టం హనుమంతుడు తన భుజాలపై శ్రీరాముడిని మోసిన సందర్భాన్ని గుర్తు చేస్తుంది. హనమద్వాహనంపై స్వామి వారి విహారం భగవంతుని పట్ల హనుమతునికి ఉన్న భక్తికి, నమ్మకానికి, అణకువకు ప్రతీక. ఈ వాహన సేవ మనిషిలోని భక్తి, సేవ ద్వారా దివ్యత్వానికి ఎలా చేరగలరో చూపిస్తుంది. రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్సై రాము బందోబస్తు నిర్వహించారు.
నేటి కార్యక్రమాలు ఇవీ..
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు సోమవారం బ్రహ్మోత్సవాల నిత్య పూజలు, హోమాలు, అభిషేకాలతో పాటు ఉదయం జగత్ కళ్యాణార్థం శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు. సాయంత్రం విశేష పూజలు, సేవలు, రాత్రి యోగనారసింహ అలంకరణతో సింహ వాహన సేవ నిర్వహిస్తారు.

చూసిన కనులదే భాగ్యం!

చూసిన కనులదే భాగ్యం!