
రూ.ఐదు లక్షల దీపావళి సామాన్లు సీజ్
తుని రూరల్: ఎస్.అన్నవరంలో అనుమతి లేకుండా నిల్వ ఉంచిన రూ.ఐదు లక్షల విలువ చేసే దీపావళి సామాన్లను సీజ్ చేసినట్టు రూరల్ ఎస్సై బి.కృష్ణమాచారి ఆదివారం తెలిపారు. ముందస్తు చర్యగా తనిఖీలు చేస్తుండగా ఎస్.అన్నవరంలో అక్రమంగా నిల్వ ఉంచిన దీపావళి సామాన్లను గుర్తించామన్నారు. సామాన్లను సీజ్ చేసి ఒకరిని అరెస్టు చేశామన్నారు. తనిఖీల్లో డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్, వీఆర్వో కృష్ణ పాల్గొన్నారు.
7వ బ్యాచ్
శిక్షణ ప్రారంభం
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉన్న 11 జిల్లాలోని మండల పరిషత్తు పరిధిలోని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈలు, డిప్యూటీ ఎంపీడీఓలకు నిర్వహిస్తున్న శిక్షణలో భాగంగా ఆదివారం 7వ బ్యాచ్ శిక్షణను గ్రామీణ తాగునీటి విభాగం ప్రభుత్వ సలహాదారు తోట ప్రభాకరరావు ప్రారంభించారు. తాగునీటిపై ఏఈఈలకు అవగాహన ఉండాలన్నారు. విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్‌వీ ప్రసాదరావు, విశ్రాంత ఎస్‌ఈలు ఉమాశంకర్, శ్రీనివాసు, సురేష్, పెద్దాపురం డీఈఈ స్వామి, ఎఈఈ శ్రీరామ్, ఈటీసీ సీనియర్ ఫ్యాకల్టీ శేషుబాబు శిక్షణ నిర్వహించారు.
రామాలయంలో
నగల చోరీ
రంగంపేట: మండల పరిధిలోని ముకుందవరంలో దేవుని గుడిలో నగలు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని కాపుల రామాలయంలో దేవతల విగ్రహాలకు నాలుగు వెండి కిరీటాలు, అమ్మవారి బంగారు తాళిబొట్టు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. వెండి కిరీటాల విలువ రూ.1.50 లక్షలు, బంగారం విలువ రూ. 1.20 లక్షలు ఉంటుందన్నారు. నగలు చోరీ జరిగినట్టు 9వ తేదీ గురువారం గుర్తించామన్నారు. 9వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

రూ.ఐదు లక్షల దీపావళి సామాన్లు సీజ్