
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి, స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనేక మంది భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారి దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.1,49,570, అన్నదాన విరాళాలు రూ.51,217, కేశఖండన ద్వారా రూ.7,480, తులాభారం ద్వారా రూ.700, ప్రసాదం విక్రయాలకు రూ.18,600 కలిపి మొత్తం రూ.2,27,627 ఆదాయం సమకూరిందని వివరించారు. భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు. దేవస్థానం సిబ్బంది, గ్రామ పెద్దలు భక్తులకు సేవలందించారు.