
వాడపల్లి వెంకన్నకు రూ.1.49 కోట్ల ఆదాయం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వెంకటేశ్వరస్వామి వారి హుండీల ద్వారా రూ.1,49,21,278 ఆదాయం వచ్చినట్టు దేవదాయ ధర్మదాయశాఖ డిప్యూటీ కమిషనర్ అండ్ ఈఓ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. బుధవారం ఆలయంలోని హుండీలను 27 రోజుల అనంతరం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో తెరచి ఆదాయాన్ని వసంత మండపంలో లెక్కించారు. ప్రధాన హుండీల ద్వారా రూ.1,15,09,966, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ.34,11,312తో మొత్తం రూ.1,49,21,278 ఆదాయం వచ్చినట్టు తెలిపారు. అలాగే 28 గ్రాముల బంగారం, రెండు కేజీల 180 గ్రాముల వెండి, కానుకలుగా వచ్చాయన్నారు. నాలుగు దేశాలకు చెందిన 45 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయన్నారు. హుండీ లెక్కింపుకు పర్యవేక్షణాధికారిగా అమలాపురం దేవదాయశాఖ అధికారి, ఏసీ సత్యనారాయణ వ్యవహరించారు. దేవదాయ ఇన్‌స్పెక్టర్ టీవీఎస్‌ఆర్ ప్రసాద్, వెలిచేరు గ్రూపు దేవాలయాల ఈఓ ఎం.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అక్టోబర్ 10 నుంచి బ్రహ్మోత్సవాలు
కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వస్వామివారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 10వ తేదీ నుంచి జరగనున్నాయని డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఆ మేరకు బుధవారం చక్రధరరావు ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వాడపల్లి క్షేత్రం భక్తుల సౌకర్యాలను ఆయన పరిశీలించారు.