సర్వేజనా ఆరోగ్యమస్తు.. | - | Sakshi
Sakshi News home page

సర్వేజనా ఆరోగ్యమస్తు..

Sep 13 2025 6:09 AM | Updated on Sep 13 2025 6:09 AM

సర్వే

సర్వేజనా ఆరోగ్యమస్తు..

జిల్లాలో ఎన్‌సీడీ 4.0 సర్వేకు చర్యలు

ఆరోగ్య సమాజమే లక్ష్యంగా ఇంటింటి సర్వే

ముందస్తు గుర్తింపుతో

సరైన వైద్యానికి అవకాశం

రాయవరం: క్యాన్సర్‌.. ప్రజల ప్రాణాలను హరించే మహమ్మారి. చాలా మందికి ఆ వ్యాధి వచ్చిందని తెలుసుకునేలోపే మృత్యువు సింహద్వారం వద్ద నుంచునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం వల్ల మరణాల సంఖ్య పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్య పరిస్థితిని ముుందుగా జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఆధ్వర్యంలో ఏటా జిల్లా వ్యాప్తంగా నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజ్‌(ఎన్‌సీడీ) ప్రోగ్రామ్‌ను చేపడుతున్నారు. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందని వ్యాధులను నాన్‌ కమ్యూనికల్‌ డిసీజెస్‌గా పిలుస్తారు. బీపీ, షుగర్‌, క్యాన్సర్‌, కిడ్నీ, గుండె తదితర జబ్బులను ముందుగానే పసిగట్టడానికి వైద్య, ఆరోగ్య సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఎన్‌సీడీ 4.0 సర్వేకు ఆ శాఖ చర్యలు ప్రారంభించింది.

నాలుగేళ్ల నుంచి..

2021 అక్టోబరులో తొలిసారిగా ఎన్‌సీడీ సర్వే చేపట్టింది. రెండో విడత 2022 అక్టోబర్‌ 2 నుంచి, మూడో విడత 2024 నవంబరులో నిర్వహించారు. కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు.

మూడో విడతలో..

గతేడాది జిల్లాలో 18 ఏళ్లు పైబడిన 14,68,723 మందిలో 11,29,412(77శాతం) మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2,06,666 మందికి బీపీ (18.30 శాతం), చక్కెర వ్యాధిగ్రస్థులు 1,41,508 (12.53 శాతం) మంది ఉన్నట్టు గుర్తించారు. నోటి సంబంధ క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులు గతంలో 215 మంది ఉండగా ఈ సర్వేలో 4,172 అనుమానిత కేసులు గుర్తించారు. అలాగే గతంలో 466 మంది రొమ్ము క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులు ఉండగా, ఈ సర్వేలో 2,090 మందికి లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. కాగా వీరిలో ముగ్గురికి మాత్రమే క్యాన్సర్‌ నిర్థారణ అయ్యింది. సర్వైకల్‌ (గర్భాశయ ముఖ ద్వార) క్యాన్సర్‌కు గురైన వారు గతంలోనే 283 మంది ఉండగా, 1,894 మంది అనుమానిత కేసులు గుర్తించారు.

నాలుగో సర్వేకు ఏర్పాట్లు

జాతీయ ఆరోగ్య మిషన్‌ ఆధ్వర్యంలో ఎన్‌సీడీ నాలుగో సర్వేకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది నిర్వహించే సర్వేలో క్యాన్సర్‌పై ప్రధానంగా దృష్టిపెడుతున్నారు. నోటి సంబంధిత, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లపై ప్రధానంగా సర్వే ఉంటుంది. సర్వేలో 110 మంది వైద్యులు పాల్గొననున్నారు. ఇప్పటికే వీరికి శిక్షణ పూర్తి చేశారు. అలాగే జిల్లాలో 527 మంది మల్టీపర్పస్‌ హెల్త్‌ ప్రొవైడర్‌, ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇస్తున్నారు. వీరికి ఆగస్టు 25న ప్రారంభమైన శిక్షణ ఈ నెల 18వ తేదీతో పూర్తికానుంది.

పరీక్షలు ఇలా

వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి 18 ఏళ్ల నిండిన వారికి పలు రకాల ఆరోగ్య పరీక్షలు చేస్తారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు, నెలసరి వివరాలు, గర్భాశయ ముఖద్వారం, రొమ్ము క్యాన్సర్‌ వంటి సమస్యలు నమోదు చేయడం ద్వారా క్యాన్సర్‌ దశను ప్రాథమిక అంచనా వేస్తారు. ఈ పరీక్షలతో పాటు బీపీ, షుగర్‌, హెమోగ్లోబిన్‌ వంటి పరీక్షలు చేస్తారు. విద్యార్థులకు పాఠశాలల్లోనే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అవసరం అయితే ఆరోగ్యశ్రీ కింద ఇతర నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తారు. ఇక బీపీ, షుగర్‌ తదితర వ్యాధులకు స్థానిక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, పీహెచ్‌సీల ద్వారా చికిత్స అందిస్తున్నారు.

వెలుగు చూస్తున్న వ్యాధులు

ఈ పరీక్షల్లో వెలుగుచూస్తున్న సమస్యల్లో బీపీ ముందు వరుసలో, తర్వాత స్థానంలో మధుమేహం ఉంటోంది. అనుమానిత జాబితాలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌, రొమ్ము, నోటి క్యాన్సర్‌ ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. బీపీ, షుగర్‌ వ్యాధులను నియంత్రణలో ఉంచుకోకుంటే శరీరంలో ప్రధాన భాగాలైన కళ్లు, కిడ్నీ, గుండె, నరాలు తదితర భాగాలు దెబ్బతింటాయి. అలాగే మద్యపానం, పొగతాగడం, గుట్కాలు తదితర వ్యసనాల వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

ప్రజలు సహకరించాలి

నాన్‌ కమ్యూనికల్‌ డిసీజెస్‌ను గుర్తించేందుకు నాలుగో విడత సర్వే ఈ ఏడాది నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నాం. మూడో విడత సర్వే మాదిరిగానే నాల్గవ విడత సర్వేకు ప్రజలు సహకరించాలి.

– డాక్టర్‌ సుమలత, ఎన్‌సీడీ జిల్లా నోడల్‌ అధికారి, కోనసీమ జిల్లా

ముందుగా గుర్తిస్తే నయం

మారిన జీవనశైలి, ధూమ, మద్యపానాలు, పొగాకు సేవనంతో పాటుగా వంశపారంపర్యం వంటి కారణాలతో క్యాన్సర్‌ రోగుల సంఖ్య పెరుగుతోంది. ముందుగా గుర్తిస్తే మెరుగైన వైద్యం అందించి నయం చేసే అవకాశం ఉంది. సర్వే చేయడం వల్ల ప్రజలకు ఉపయోగం.– డాక్టర్‌ దుర్గారావు దొర,

డీఎంహెచ్‌ఓ, కోనసీమ జిల్లా

సర్వేజనా ఆరోగ్యమస్తు.. 1
1/3

సర్వేజనా ఆరోగ్యమస్తు..

సర్వేజనా ఆరోగ్యమస్తు.. 2
2/3

సర్వేజనా ఆరోగ్యమస్తు..

సర్వేజనా ఆరోగ్యమస్తు.. 3
3/3

సర్వేజనా ఆరోగ్యమస్తు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement