
పట్టాలెక్కిన ప్రసాద్ నిర్మాణాలు
అన్నవరం: రత్నగిరిపై ప్రసాద్ పథకం నిధులతో చేపట్టనున్న నిర్మాణాలకు రంగం సిద్ధమైంది. ఈ పథకం కింద కేటాయించిన రూ.25.32 కోట్లలో రూ.18.98 కోట్లతో చేపట్టనున్న పనులకు గత మే నెలలో టెండర్లు ఖరారైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయా పనులు చేపట్టనున్న స్థలాలను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజినీర్ వెంకటరమణ శుక్రవారం పరిశీలించారు. అతి త్వరలో ప్రతిపాదించిన నిర్మాణాలు ప్రారంభిస్తామని, వచ్చే ఆగస్టు నాలుగో తేదీకి వాటిని పూర్తి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. లేకుంటే ఆ నిధులు మురిగిపోతాయని వివరించారు. ఆయన వెంట ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈ రామకృష్ణ, టూరిజం ఈఈ విజయ భాస్కరరెడ్డి, డీఈ సత్యనారాయణ, ఏఈ వెంకటేష్ పాల్గొన్నారు.
ప్రసాద్ నిధులతో అన్నదాన భవనం నిర్మించే స్థలాన్ని పరిశీలిస్తున్న టూరిజం
సీఈ వెంకట రమణ, ఇతర అధికారులు