
దేవస్థానానికి చెరువుల స్వాధీనం
కాజులూరు: ఆర్యావటంలో అనధికారికంగా కొనుగోలు చేసిన శ్రీ సీతారామస్వామి దేవస్థానం భూమిని కోర్టు ఉత్వర్వుల మేరకు శుక్రవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు దేవస్థానం అధికారులకు అప్పగించారు. వివరాల్లోనికి వెళ్లితే ఆర్యావటంలో పురాణ ప్రసిద్ధిగాంచిన సీతారామస్వామి దేవస్థానానికి ధూపదీప నైవేద్యాల నిమిత్తం కేటాయించిన నాలుగు ఎకరాల ఆరు సెంట్లు భూమిని వంశపారంపర్య అర్చకుడు 1999వ సంవత్సరంలో అనధికారికంగా ఆరుగురు వ్యక్తులకు విక్రయించారు. ఆ విక్రయాలు చెల్లవని దేవస్థానం అధికారులు కోర్టుని ఆశ్రయించగా 2006లో జిల్లా కోర్టు దేవస్థానానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై కొనుగోలుదారులు హైకోర్టును ఆశ్రయించగా వాదోపవాదానల అనంతరం హైకోర్టు గత మార్చి నెలలో సదరు భూమి దేవస్థానానికి చెందుతుందని తీర్పు ఇచ్చింది. దీనిపై కోర్టు ఆదేశాల ప్రకారం శుక్రవారం గొల్లపాలెం ఎస్సై ఎం.మోహన్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది చెరువుల వద్దకు వచ్చి నాలుగు ఎకరాల ఆరు సెంట్లు భూమిని దేవస్థానం అధికారులకు అప్పగించారు.