మరిడమ్మ సన్నిధి.. భక్తుల పెన్నిధి | - | Sakshi
Sakshi News home page

మరిడమ్మ సన్నిధి.. భక్తుల పెన్నిధి

Jul 7 2025 6:29 AM | Updated on Jul 7 2025 12:40 PM

పెద్దాపురం: ఆషాఢ మాస మహోత్సవాల్లో భాగంగా పెద్దాపురం మరిడమ్మ అమ్మవారిని ఆదివారం వేలాదిగా భక్తులు దర్శించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనానికి భారీగా బారులు తీరారు. సుమారు 50 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా ఆలయ ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష, అసిస్టెంట్‌ కమిషనర్‌ విజయలక్ష్మి ఆధ్వర్యాన ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ శ్రీహరిరాజు ఆదేశాల మేరకు సీఐ విజయ్‌ శంకర్‌ పర్యవేక్షణలో ఎస్సై మౌనిక, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పెద్దాపురం బ్రాహ్మణ సేవా సంఘం, సామర్లకోట లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యాన భక్తులకు పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు.

ముగిసిన హాకీ ప్రత్యేక శిక్షణ శిబిరం

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): జిల్లా కలెక్టర్‌ అనుమతితో కాకినాడ డీఎస్‌ఏ హాకీ మైదానంలో గత పది రోజులుగా జరుగుతున్న ఇన్‌కమ్‌ట్యాక్స్‌ డిపార్డ్‌మెంట్‌ ప్రత్యేక హాకీ శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. త్వరలో జరగనున్న మురుగప్ప గోల్డ్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే ఇన్‌కమ్‌ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ జట్టుకు శిక్షణ ఇచ్చేందుకు ఆలిండియా చీఫ్‌ కోచ్‌ రవిచంద్ర, సీనియర్‌ కోచ్‌ అజయ్‌శర్మ ఆధ్వర్యాన ఈ శిబిరం నిర్వహించారు. 

శిక్షణ ముగింపు సందర్భంగా హాకీ సంఘ ప్రతినిధి వి.రవిరాజు ముఖ్య శిక్షకులను సత్కరించారు. మే నెలలో నిర్వహించిన హాకీ వేసవి శిక్షణ శిబిరంలో శిక్షణ అందించిన కోచ్‌లు సూరిబాబు, అజయ్‌కుమార్‌, గంగాధర్‌, డీఎస్‌ఏ హాకీ కోచ్‌ నాగేంద్ర కుమార్‌లకు రవిచంద్ర క్రీడా దుస్తులు, బూట్లు ఇచ్చి సత్కరించారు. ఆలిండియా టీములో కాకినాడకు చెందిన కిరణ్‌తేజకు స్థానం దక్కడం జిల్లాకు గర్వకారణమని రవిరాజు తెలిపారు.

జేఎన్‌టీయూకే ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా శ్రీనివాసరావు

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్‌టీయూకే ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ ఆర్‌.శ్రీనివాసరావు, రెక్టార్‌గా ప్రొఫెసర్‌ వీవీ సుబ్బారావు నియమితులయ్యారు. ఈ మేరకు వైస్‌ చాన్సలర్‌ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటి వరకూ రిజిస్ట్రార్‌గా పని చేసిన రవీంద్రనాథ్‌ను, రెక్టార్‌ కేవీ రమణను రిలీవ్‌ చేయాలని సూచించారు. ఆర్‌.శ్రీనివాసరావు గతంలో కొద్ది నెలల పాటు జేఎన్‌టీయూకే ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌తో పాటు కృష్ణా యూనివర్సిటీకి ఇన్‌చార్జి వీసీగా 7 నెలల పాటు పని చేశారు. శ్రీనివాసరావు, సుబ్బారావులను పలువురు టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది అభినందించారు.

ఇంద్ర బస్సు ప్రయాణంలో రాయితీ

రాజమహేంద్రవరం సిటీ: ఆషాఢ మాసం సందర్భంగా రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌ వెళ్లే ప్రయాణికులు సూపర్‌ లగ్జరీ ధరకే ఇంద్ర ఏసీ బస్సులో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్‌ కె.మాధవ్‌ ఆదివారం తెలిపారు. ఇంద్ర ఏసీ బస్సు చార్జీలో 15 శాతం రాయితీ కల్పించామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు ఇంద్ర ఏసీ బస్సు టికెట్టు రూ.1,060 ఉండగా రాయితీపై రూ.920కే అందిస్తున్నామని తెలిపారు.

మరిడమ్మ సన్నిధి.. భక్తుల పెన్నిధి 1
1/1

మరిడమ్మ సన్నిధి.. భక్తుల పెన్నిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement