● ఈ– కేవైసీ సాకుతో కోతకు ఎత్తుగడ!
● రేషన్ దుకాణాల వద్ద గంటల
తరబడి పడిగాపులు
● మూడు రోజులే గడువు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వ్యవసాయాధారితమైన జిల్లాలో రబీ మాసూళ్లు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. రైతులు, వ్యవసాయ కూలీలు క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నారు. పదో తరగతి, డిగ్రీ పరీక్షలతో విద్యార్థులందరూ పుస్తక పఠనలో మునిగి తేలుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం అనాలోచితంగా రేషన్ కార్డులకు ఈ–కేవైసీ (ఎలక్ట్రానిక్–నో యువర్ కస్టమర్) చేయించుకోవాలని హడావిడి చేస్తోంది. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి పది నెలలవుతున్నా అర్జీలు పెట్టుకున్న వారికి ఇప్పటి వరకూ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. పైగా ఉన్న కార్డులకు కత్తెర వేసేందుకు ఎత్తులు వేస్తున్నట్లు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలని, అది కూడా ఈ నెలాఖరులోపు అంటూ గడువు విధించడంతో కార్డుదారులు గగ్గోలు పెడుతున్నారు. గడువుకు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
సమయమేదీ..!
జిల్లావ్యాప్తంగా 6,43,874 రేషన్ కార్డులున్నాయి. గతంలో ఈ–కేవైసీ పూర్తి చేసుకున్న వారు 16,36,012 మంది ఉన్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియ 2,01,424 మందికి పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వ ఆదేశాలతో తాజాగా 5,755 మంది ఈ–కేవైసీ చేయించుకున్నారు. జిల్లాలో 620 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. డీలర్ల వద్ద 1,060 ఈ–పోస్ యంత్రాలున్నాయి. ఈ–కేవైసీ చేయించుకునే అవకాశం ఈ రెండుచోట్ల మాత్రమే ఉంది. డీలర్ల వద్ద సర్వర్లతో సాంకేతిక ప్రతిబంధకాలు ఎదురవుతూండటంతో ఈ–కేవైసీ పెద్ద సమస్యగా మారిందని చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 21 మండలాలకు గాను 10 మంది మాత్రమే పౌర సరఫరాల ఉప తహసీల్దార్లు ఉన్నారు. ఈ నెల 20న ఈ–కేవైసీ ప్రారంభించి, 31వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేవలం 11 రోజుల్లో ఇంత మంది ఈ–కేవైసీ పూర్తి చేయడం ఏవిధంగా సాధ్యమనే ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు.
పిల్లలకూ కష్టాలు
ఐదేళ్ల వయస్సు దాటి, వేలిముద్ర అప్‌డేట్ చేయించుకోని పిల్లలకు ఇప్పుడు ఈ–కేవైసీ పెద్ద సమస్యగా మారింది. వారి వేలిముద్రలు అప్‌డేట్ చేయించేందుకు తల్లిదండ్రులు ఆధార్ సెంటర్ల వద్ద గంటల తరబడి పడిగావులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోవైపు ఐదేళ్ల నుంచి 12–13 ఏళ్ల లోపు పిల్లలకు, 70 ఏళ్లకు పైబడిన వృద్ధులకు ఈ–కేవైసీ నమోదు కావడం లేదు. సర్వర్ సమస్య వేధిస్తోందని పదేపదే మొత్తుకుంటున్నా పట్టించుకున్న నాథుడే కరవయ్యాడని ప్రజలు మండిపడుతున్నారు.
కార్డుల తొలగింపునకు కుట్రేనా?
నిత్యావసర సరకుల పంపిణీలో తేడాలు, అవకతవకలను నివారించేందుకనే సాకుతో రేషన్ కార్డులను తొలగించేందుకే కూటమి సర్కార్ ఈ–కేవైసీ కుట్రకు తెర తీసిందని కార్డుదారులు మండిపడుతున్నారు. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులందరూ నెలాఖరులోగా తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోకపోతే ఏప్రిల్ నెల సరకులు అందవని రెవెన్యూ అధికారులు చెబుతున్న మాటలతో కార్డుదారుల్లో ఆందోళన నెలకొంది. రేషన్ నిలిపివేస్తారో.. లేక కార్డులను రద్దు చేస్తారోనని వారు మల్లగుల్లాలు పడుతున్నారు. రేషన్ కార్డులు లేకపోతే సంక్షేమ పథకాల్లో కోత తప్పదంటున్న రెవెన్యూ అధికారుల మాటలతో సర్వత్రా ఆందోళన నెలకొంది. పౌర సరఫరాల శాఖ అధికారులు శుక్రవారం నాటి సమీక్షలో ప్రస్తుతానికి ఈ–కేవైసీ చేయించుకోకున్నా రేషన్ ఆపేది లేదని చెబుతున్నా అది ఎంత వరకూ వర్తిస్తుందో తెలియడం లేదనే అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయి.
కొత్త కార్డులకు దిక్కే లేదు
కూటమి సర్కార్ గద్దెనెక్కిన తొమ్మిది నెలల కాలంలో జిల్లావ్యాప్తంగా సుమారు 70 వేల మంది కొత్త రేషన్ కార్డులకు, మరో 40 వేల మందికి పైగా కార్డుల్లో తప్పుల సవరణకు దరఖాస్తులు చేసుకున్నారని చెబుతున్నారు. కొత్త కార్డులు ఇవ్వకపోగా, ఉన్న కార్డులను ఎలా తొలగించాలనే కుట్రలో భాగంగానే ఈ–కేవైసీ డ్రామా మొదలు పెట్టారని అంటున్నారు. ఈ–కేవైసీ నమోదు కాకుంటే ఆ కార్డులోని సభ్యులను తొలగించి రేషన్‌కు కోత పెడతారని అనధికారిక సంభాషణల్లో అధికారులు చెబుతున్నారని కార్డుదారులు ఆందోళన చెదుతున్నారు.
మచ్చుకై నా కనిపించని కంది పప్పు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా కార్డుదారులందరికీ కందిపప్పు సరఫరా చేశారు. అటువంటిది కూటమి సర్కార్ వచ్చాక రేషన్‌తో పాటు కందిపప్పు ఇస్తారనే విషయాన్నే కార్డుదారులు మరచిపోయారు. ఇప్పుడు ఏప్రిల్ నెలలో కూడా కందిపప్పు సరఫరా చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే బియ్యం, పంచదార మండల స్థాయి నిల్వ కేంద్రాలకు, చౌకదుకాణాలకు తరలిస్తున్నారు. ఈ కేంద్రాల్లో కందిపప్పు నిల్వలు లేవు. జిల్లాలో 6.43 లక్షల కార్డులకు ప్రతి నెలా 650 టన్నుల కందిపప్పు అవసరం. మార్చి నెలలో కేవలం 200 టన్నులు సరఫరా చేశారు. అది కూడా కార్డుదారుల దరి చేరలేదు. వచ్చే నెల పంపిణీకి ఇప్పటికే సరుకు జిల్లాకు చేరాల్సి ఉన్నా ఆ ప్రక్రియ జరిగిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఈ–కేవైసీ పేరుతో మిగిలిన సరకులకు కూడా కోత పెడతారేమోనని కార్డుదారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
గడువు పెంచాలి
ఈ నెల 31లోపు ఈ–కేవైసీ చేయించుకోవాలనే గడువు పెట్టడం సమజసం కాదు. ఈ గడువు పెంచాల్సిందే. రేషన్ దుకాణదారులు ప్రతి రోజూ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ మాత్రమే ఈ–కేవైసీ చేస్తున్నారు. పరీక్షల సమయం ఒకపక్క, వ్యవసాయ పనుల్లో మరోపక్క బిజీగా ఉండటంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు తక్కువ సమయం ఇచ్చి ఈ–కేవైసీ చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేయడం సరి కాదు.
– కర్రి ఉమామహేశ్వరరావు, సామర్లకోట
రేషన్ వ్యవస్థపై విషం
కూటమి ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచీ రేషన్ వ్యవస్థపై విషం చిమ్ముతోంది. ముందుగా ఎండీయూ వాహనాలను తొలగిస్తామని భయపెట్టింది. తొమ్మిది మాసాలుగా ఏ నెలలోనూ కందిపప్పు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏప్రిల్‌లోను కందిపప్పు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడేమో ఈ–కేవైసీ సాకుతో రేషన్‌లో కోత పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రేషన్ డీలర్ల వద్ద రోజుకు రెండు గంటల పాటు మాత్రమే ఈ–కేవైసీ చేయించుకోవాలంటే ఇన్ని లక్షల మందికి ఎక్కడవుతుంది? కనీసంగా కూడా ఆలోచించకుండా తక్కువగా గడువు ఇవ్వడం అన్యాయం.
– పోకనాటి ప్రభాకరమూర్తి, విద్యా కమిటీ
మాజీ చైర్మన్, వాకలపూడి, కాకినాడ రూరల్
ఈ–కేవైసీ కోసం పెద్దాపురంలో
మండుటెండలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు
పేదల రేషన్‌పై కూటమి కత్తి
పేదల రేషన్‌పై కూటమి కత్తి