కాకినాడ సిటీ: పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఈ పనుల పురోగతిపై అమరావతి నుంచి ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్, ఆ శాఖల ప్రధాన కార్యదర్శి శశిభూషణ్, డైరెక్టర్ కృష్ణతేజ తదితరులు శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి కలెక్టర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, శనివారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఫార్మ్ పాండ్స్ పనులు ప్రారంభించాలన్నారు. జిల్లాలో 196 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణానికి గాను 138 కిలోమీటర్ల మేర పూర్తి చేశామని చెప్పారు. 804 మినీ గోకులాలు నిర్మించామన్నారు. 2,500 ఫార్మ్‌పాండ్స్‌కు గాను 823 గ్రౌండింగ్ పూర్తి చేశామని తెలిపారు.
మెప్మా టీముకు రాష్ట్ర స్థాయి అవార్డు
సామర్లకోట: స్థానిక మెప్మా టీముకు రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చిందని మెప్మా సిటీ మిషన్ మేనేజర్ హుస్సేన్ తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ, మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను శ్రీవావ్ జెనీశ్రీ యాప్ ద్వారా కోటి విక్రయించాలని రాష్ట్ర మెప్మా అధికారులు లక్ష్యంగా నిర్దేశించారన్నారు. అయితే సామర్లకోటకు చెందిన మెప్మా టీము రెండు కోట్ల వరకూ ఉత్పత్తులను విక్రయించడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు సామర్లకోట మెప్మా బృందానికి రాష్ట్రస్థాయి పురస్కారం అందించారని చెప్పారు. ఈ పురస్కారాన్ని రాష్ట్ర మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్.తేజ్‌భరత్ కాకినాడ మెప్మా కార్యాలయానికి పంపారని తెలిపారు. ఈ మేరకు కాకినాడలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ బి.ప్రియంవద చేతుల మీదుగా మెప్మా టీము తరఫున అవార్డు అందుకున్నానని హుస్సేన్ తెలిపారు. సామర్లకోట మెప్మా టీము ఇటువంటి అవార్డులు మరిన్ని సాధించాలని హుస్సేన్ ఆకాంక్షించారు.
నాణ్యతా ప్రమాణాల గుర్తింపులో ఎన్‌ఏబీఎల్‌ది కీలక పాత్ర
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): నాణ్యతా ప్రమాణాల గుర్తింపులో నేషనల్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ కాలిబ్రేషన్ లేబొరేటరీ (ఎన్‌ఏబీఎల్) కీలక పాత్ర పోషిస్తోందని జేఎన్‌టీయూకే ఇన్‌చార్జి రిజిస్ట్రార్ వి.రవీంద్రనాథ్ అన్నారు. జేఎన్‌టీయూకేలో ఫుడ్ టెక్నాలజీ ఆధ్వర్యాన ఎన్‌ఏబీఎల్ అక్రిడిటేషన్, దాని ప్రయోజనాలు అనే అంశంపై ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పరిశ్రమల ప్రతినిధులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ, జేఎన్‌టీయూకేలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ద్వారా మెరుగైన నాణ్యతా పరీక్షలు చేస్తున్నామని అన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఆహార పరిశ్రమలు తమ ఉత్పత్తుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేందుకు చేపట్టాల్సిన విధివిధానాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఎన్‌ఏబీఎల్ రీజినల్ హెడ్ శ్రీకాంత్ రామచంద్రయ్య మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎన్‌ఏబీఎల్ గుర్తింపు పొందిన పరిశ్రమలు, ప్రయోగశాలలు 9 వేలకు పైగా ఉన్నాయని తెలిపారు. ఉన్నతమైన పరిశ్రమలకు, ప్రయోగశాలలకు ఎన్‌ఏబీఎల్ గుర్తింపు ఇస్తామన్నారు. వికసిత్ భారత్–2047లో భాగంగా నిర్మాణంలో ఉన్న భవనాలు, ఆసుపత్రుల నిర్మాణ సామగ్రి పరీక్షిస్తామని తెలిపారు. అలాగే, రైతుల కు బాసటగా నిలిచేందుకు పొలాల్లో మట్టిని పరీక్షించి, తగు సూచనలు చేయనున్నామని చెప్పా రు. స్కూల్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ డైరెక్టర్ మాలోతు రమేష్ మాట్లాడుతూ, జేఎన్‌టీయూకే ఫుడ్ టెస్టింగ్ ద్వారా రాష్ట్రంలోని వివిధ పరిశ్రమలు, ప్రభు త్వ శాఖలకు చెందిన ఆహారం, నీటి పరీక్షలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం వివిధ సంస్థల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఓఎన్‌జీసీ, కోరమండల్, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్, గ్రీన్‌కో, ఎస్‌ఐఎఫ్‌టీ తదితర సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు పాల్గొన్నారు.
నెలాఖరులోగా పల్లె పండుగ పనులు