బలసిరి.. కొత్త వరి | - | Sakshi
Sakshi News home page

బలసిరి.. కొత్త వరి

May 27 2025 12:04 AM | Updated on May 27 2025 12:04 AM

బలసిర

బలసిరి.. కొత్త వరి

పిఠాపురం: రంగు.. రుచి.. వాసన.. ఇదేదో వాణిజ్య ప్రకటన అనుకుంటే పొరపాటే. వరిలోనూ ఇటువంటి లక్షణాలున్న బియ్యం అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఇటువంటి బియ్యం ఉన్నాయని చెబితే.. ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు. ఇటువంటి అనేక రకాల కొత్త వంగడాలను ఇక్కడి రైతులు పండిస్తూ అందుబాటులోకి తెస్తున్నారు. అత్యధిక పోషక విలువలున్న వరి వంగడాలను ఉత్పత్తి చేయడానికి ప్రకృతి వ్యవసాయ రైతులు నడుం బిగించారు. అరుదైన వరి రకాలు గతంలో రాష్ట్రేతర ప్రాంతాల నుంచి తెచ్చే స్థానిక రైతులు.. ఇప్పుడు కాకినాడ జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు పలు రకాల వరి వంగడాలను ఆన్‌లైన్‌ ద్వారా విక్రయిస్తున్నారు. ఇక్కడ పండించిన అరుదైన వరి రకాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వర స్వామివారి నైవేద్యానికి సైతం ఉపయోగిస్తుండడం విశేషం. ఈ అరుదైన రకాల్లో నవారా, ఇంద్రాణి, కాలపట్టి, డెహ్రాడూన్‌ రెడ్‌ రైస్‌, పరిమళ సన్న, బర్మా బ్లాక్‌, రత్నచొడి, రక్తసాలి, చింతలూరు సన్నాలు, కూజి, పాటలియా, బాస్‌బోగ్‌, కామిని బోగ్‌, మైసూర్‌ మల్లిగ, సిద్ధ సన్నాలు, కోమల్‌ సాల్‌ వంటి రకాలున్నాయి. జిల్లాలో సుమారు 25 హెక్టార్లలో 30 మంది రైతులు సేంద్రియ పద్ధతిలో అరుదైన వరి రకాలను పండిస్తున్నారు.

జిల్లాలో అరుదైన రకాలివే..

● రక్తసాలి రక్త హీనతతో బాధపడుతున్న వారికి మంచి ఆహారం. ఈ బియ్యం తినడం వల్ల హిమోగ్లోబిన్‌ పర్సంటేజ్‌ పెరుగుతుంది. మూడు వేల ఏళ్ల నుంచి ఇది వాడుకలో ఉంది.

● కూచి పట్టాలియా బాగా సన్నగా ఉంటుంది. తినడానికి బాగుంటుంది. పోషకాలు ఎక్కువ.

● నవరను కింగ్‌ ఆఫ్‌ రైస్‌ అంటారు. ప్రస్తుతం దేశంలో లభించే బియ్యంలో అత్యంత పోషక విలువలున్న ఆహారం. సుగర్‌ వ్యాధిగ్రస్తులకు చాలా మంచి ఆహారం. దీనిని రోజూ తింటే సుగర్‌ నార్మల్‌కు వస్తుంది. మోకాళ్ల నొప్పులూ తగ్గిస్తుంది.

● ధూదేశ్వర్‌ అనే దేశీయ వరి విత్తనం. గాలులకు పడిపోని సన్న రకం. పంటకాలం సుమారు 120 రోజులు. ఇది తెలుపు రంగులో ఉంటుంది, బాలింతలకు శక్తినిచ్చి, తల్లులకు, పిల్లలకు అధిక పోషకాలు అందిస్తుంది. పాల వృద్ధి, పిల్లల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

● ఇంద్రాణి అనేది దేశీయ వరిరకం. సువాసన ఉండే ఈ రకం పంట కాలం సుమారు 130 రోజులు. పాయసం, పులిహోర, పలావు, దద్దోజనానికి అనుకూలమైంది.

● రత్నచొడి అనే దేశీయ వరి విత్తనం. తెలుపు రంగులో ఉండే సన్న రకం. పంట కాలం సుమారు 135 రోజులు. అధిక పోషక విలువలు కలిగి, కండపుష్ఠి, శరీర ధారుడ్యం పెంచి, మంచి పోషకాలు కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తి కలిగిస్తుంది. పూర్వకాలంలో సైనికులకు ఆహారంగా ఇచ్చేవారు.

● కుజీపటాలియా అనేది దేశీయ విత్తనం. సన్న రకం. పంటకాలం సుమారు 120 రోజులు. గాలులకు పడిపోదు. కొవ్వు రహిత, సోడియం లేనివి. తక్కువ కేలరీలు, గ్లూకోజ్‌ తక్కువగా ఉండి, రోగ నిరోధక శక్తి పెంచుతుంది.

● కేత్రీ మహరాజ్‌ సెంటెడ్‌ వైరెటీ. గింజ పొడవుగా ఉంటుంది. పంటకాలం సుమారు 130 రోజులు. పాయసం, దద్దోజనం, పులిహోర పలావులకు బాగుంటుంది.

● మైసూరు మల్లిగ దేశీయ విత్తనం. తెల్లని రంగు, గాలులకు పడిపోని సన్నని గింజ. పంట కాలం సుమారు 120 రోజులు. ఎదిగే పిల్లలకు అధిక పోషకాలు, ప్రొటీన్లు అందిస్తుంది.

● ఘని అనే దేశీయ వరి రకం. చిన్న గింజ. పంటకాలం సుమారు 130 రోజులు. అధిక ఫైబర్‌, కాల్షియం కలిగి ఉంటుంది. స్పాండిలైటిస్‌, మోకాళ్ల నొప్పులు తగ్గించే ఆహార ఔషధంగా గుర్తింపు పొందింది.

● కుంకుమసాలి.. కుంకుమ పువ్వు, రక్తసాలి మొదలైన విత్తనాలు ఒకే కోవకు చెందిన దివ్యమైన ఔషధాలు. ఇవి రక్తంలోని మలినాలను శుభ్రం చేసి, వాత, పిత్త, కఫాలను సమపాళ్లలో ఉంచే దివ్యమైన ఆహార ఔషధాలు.

జిల్లాలో పెరిగిన కొత్త విత్తనాభివృద్ధి

అందుబాటులోకి ఆధునిక వరి వంగడాలు

విత్తనాభివృద్ధికి ప్రా‘ధాన్యం’

ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు

ఆరోగ్యదాయక సాగుపై

ప్రకృతి రైతుల ఆసక్తి

చాలా డిమాండ్‌ ఉంది

పన్నెండేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రాణప్రదంగా చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలో పండించిన అరుదైన రకాల ధాన్యం తిరుమల తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వర స్వామివారికి నైవేద్యంగా ఉపయోగించడానికి ఇస్తున్నాను. సాధారణ రకాల కంటే.. మంచి డిమాండ్‌ ఉన్న అరుదైన రకాలను సాగు చేస్తున్నాను. ఇతర ప్రాంతాల నుంచి వివిధ రకాల విత్తనాలు తెచ్చి, విత్తనాభివృద్ధి చేస్తున్నాను. కేవలం విత్తనాలకు మాత్రమే వీటిని పండిస్తున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కొనుగోలు చేస్తున్నారు. వీటిని ఆన్‌లైన్‌ ద్వారా పంపిస్తున్నాం. ఈ బియ్యానికి మంచి డిమాండ్‌ ఉండడంతో ఆదాయం బాగుంటుంది. నాతో పాటు జిల్లాలో చాలా మంది రైతులు వీటి సాగు ప్రారంభించారు. ఇతర రాష్ట్రాల రైతులూ నా వద్ద విత్తనాలు తీసుకుంటున్నారు.

– అడపా వెంకటరమణ, ప్రకృతి వ్యవసాయ రైతు,

భోగాపురం, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా

విత్తనం కోసమే పండిస్తున్నా...

ప్రకృతి వ్యవసాయంలో పలు రకాల ధాన్యాన్ని పండిస్తున్నాను. కేవలం విత్తనాల కోసం కొన్ని అరుదైన రకాలు పండిస్తున్నాను. ఎవరైనా విత్తనాలకు అడిగితే ఉచితంగా ఇస్తున్నాను. అరుదైన రకాలు మంచి ఫలితాలు ఇస్తుండడంతో చాలా మంది ఆన్‌లైన్‌ ద్వారా తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. చాలా మంది రైతులు వీటి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఎకరం పొలంలో పది రకాల అరుదైన రకాలను పండిస్తున్నాను. మన ప్రాంతంలో వీటిని పరిచయం చేయాలన్న ఆలోచనతో సాగు చేస్తున్నాను. ఈ సాగంతా పాతకాల పద్ధతిలోనే చేయాలి. యంత్రాలతో సాధ్యం కాదు. కేవలం చేతితో కొట్టి, నూర్చి, ఆరబెట్టడం ద్వారా మంచి విత్తనం తయారవుతుంది.

– ఉల్లి సురేష్‌, ప్రకృతి వ్యవసాయ యువ రైతు,

కొత్తపల్లి, కాకినాడ జిల్లా

బలసిరి.. కొత్త వరి1
1/4

బలసిరి.. కొత్త వరి

బలసిరి.. కొత్త వరి2
2/4

బలసిరి.. కొత్త వరి

బలసిరి.. కొత్త వరి3
3/4

బలసిరి.. కొత్త వరి

బలసిరి.. కొత్త వరి4
4/4

బలసిరి.. కొత్త వరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement