ఆర్మీలో అగ్నివీర్‌ అవుతారా? | - | Sakshi
Sakshi News home page

ఆర్మీలో అగ్నివీర్‌ అవుతారా?

Mar 17 2025 12:09 AM | Updated on Mar 17 2025 12:09 AM

ఆర్మీలో అగ్నివీర్‌ అవుతారా?

ఆర్మీలో అగ్నివీర్‌ అవుతారా?

రాజమహేంద్రవరం రూరల్‌: దేశ రక్షణ కోసం సైన్యంలో చేరాలనుకునే యువతకు శుభవార్త. అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రిక్రూట్‌మెంట్‌ చరిత్రలో తొలిసారిగా ప్రవేశ పరీక్షను ఏకంగా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఎంతో ఉపయుక్తంగా మారనుంది. మరోవైపు రాష్ట్రంలోని 13 జిల్లాల అభ్యర్థుల కోసం ఆర్మీ అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి విశాఖపట్నం మరోసారి వేదిక కానుంది. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ ఇటీవలే విడుదలైంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ అంబేడ్కర్‌, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌ కృష్ణా, మచిలీపట్నం జిల్లాల అభ్యర్థులకు విశాఖలో ఎంపికలు నిర్వహించాలని ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం నిర్ణయించింది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఏప్రిల్‌ 10వ తేదీలోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ ట్రేడ్స్‌ మెన్‌ కేటగిరీల కోసం ఈ రిక్రూట్‌మెంట్‌ నిర్వహిస్తున్నారు. అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌కు 8వ తరగతి, జనరల్‌ డ్యూటీ కేటగిరీలకు 10వ తరగతి అర్హతగా నిర్ణయించారు. అలాగే 17.5 నుంచి 21 సంవత్సరాల వయసు ఉన్న అభ్యర్థులే అర్హులు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేవారు మాత్రమే ఈ రిక్రూట్‌మెంట్‌కు హాజరు కావాలని అధికారులు స్పష్టం చేశారు.

ఈ ఏడాది కీలక మార్పులు

ఈసారి అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌లో పలు ముఖ్యమైన మార్పులు చేశారు. గతంలో అభ్యర్థులు ఒక కేటగిరీకి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, ఈసారి రెండు కేటగిరీల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఎన్‌సీసీ, ఐటీఐ, పాలిటెక్నిక్‌ డిప్లమా వంటి అదనపు విద్యార్హతలు కలిగిన వారికి బోనస్‌ మార్కులు లభిస్తాయి. గతంలో హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో మాత్రమే నిర్వహించిన కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (సీఈఈ)ను ఇప్పుడు తెలుగుతో సహా 13 భాషల్లో రాసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడించింది. రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి సంబంధించిన అడ్మిట్‌ కార్డులను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అడ్మిట్‌ కార్డులో ర్యాలీకి హాజరుకావాల్సిన తేదీ, సమయం వంటి వివరాలు ఉంటాయి. అభ్యర్థుల సౌకర్యం కోసం రిక్రూట్‌మెంట్‌ జరిగే ప్రదేశంలో ప్రత్యేక రిపోర్టింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్‌ విధానంలో పారదర్శకంగా జరుగుతుందని రక్షణ శాఖ వర్గాలు తెలియజేశాయి. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం లైవ్‌ చాట్‌ సదుపాయంతో పాటు ‘ఆర్మీ కాలింగ్‌’అనే ఆన్‌లైన్‌ మొబైల్‌ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మరింత సమాచారం కోసం www. joinindianarmy.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా విశాఖపట్నంలోని ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయంలోని 0891– 2756959, 0891–2754680 నంబర్లకు ఫోన్‌ చేయాలని రక్షణ శాఖ అధికారులు సూచించారు.

అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌లో భారీ మార్పులు

13 భాషల్లో ప్రవేశ పరీక్ష రాసే అవకాశం

ఎన్‌సీసీ, ఐటీఐ, పాలిటెక్నిక్‌

డిప్లమా అభ్యర్థులకు బోనస్‌ మార్కులు

విశాఖలో మరోసారి ర్యాలీ

ఏప్రిల్‌ 10 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement