
● దీపావళి వేడుకలకు సర్వం సిద్ధం
● జిల్లా వ్యాప్తంగా 420 దుకాణాల ఏర్పాటుకు అనుమతులు
● 7 ఫైర్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక కాల్ సెంటర్లు
● మూడు శాఖల పరస్పర
సమన్వయంతో ఏర్పాట్లు
కాకినాడ క్రైం: చీకట్లు చీల్చుకుంటూ వెలుగు పూలు విరబూసే పండగ.. దీపావళి వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఒకవైపు పండగ సందడితో ఇళ్లు కళకళలాడుతూంటే.. మరోవైపు టపాసుల విక్రయాల హడావుడి మొదలైపోయింది. ఈ వెలుగుల పండగలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా విషాదాల చీకట్లు అలముకుంటాయనే అనుభవాలు కొత్తేమీ కాదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం.. ఈ పండగకు ఆది నుంచి ముగిసే వరకూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలను ఆదేశించింది. దీంతో అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ శాఖలు ఈ అంశంపై దృష్టి పెట్టాయి. దీపావళి వేళ ప్రమాదాల నివారణపై కరపత్రాలు, అపార్టుమెంట్లలో సమావేశాలు, మైక్ సెట్ల ద్వారా ప్రచారం వంటి కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని సాలిపేట అగ్నిమాపక కేంద్రం ఫైర్ ఆఫీసర్ ఉద్దండరావు సుబ్బారావు చెప్పారు. దీపావళి భద్రతపై కలెక్టర్ మార్గనిర్దేశంలో పోలీస్, ఫైర్, రెవెన్యూ శాఖల అధికారులతో త్రీ మెన్ కమిటీ ఏర్పాటైందని కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ భగవాన్ తెలిపారు. ఈ స్టేషన్ పరిధిలో జిల్లాలోనే అత్యధిక బాణసంచా దుకాణాలు ఏర్పాటైనందున భద్రత, పార్కింగ్ నిర్వహణకు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాలతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ఆర్‌డీఓ, తహసీల్దార్, సాలిపేట ఫైర్ అధికారులతో కలిసి మెక్లారిన్ గ్రౌండ్‌లో ఏర్పాటైన బాణసంచా దుకాణాల్లో తనిఖీలు చేశామని భగవాన్ చెప్పారు. జిల్లాలోని ఏడు అగ్నిమాపక కేంద్రాల పరిధిలో మొత్తం 420 మందుగుండు సామగ్రి దుకాణాలకు అనుమతి ఇచ్చారు.
ఈ జాగ్రత్తలు పాటించాలి
బాణసంచా కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు, కళ్లజోడు, చెప్పులు ధరించడం తప్పనిసరని కాకినాడ జగన్నాథపురం ఏడీఎఫ్‌ఓ ఏసుబాబు సూచించారు. భవనాలపై అంతస్తుల్లో టపాసులు కాల్చకూడదని, ఇసుక, నీరు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. భారీ శబ్దాలు, పొగ కారక బాణసంచా కాల్చకూడదన్నారు. పేలని, కాలని వాటి జోలికి పోకూడదని, కొంత సమయం తర్వాత నీరు లేదా ఇసుక వేసి దూరం జరపాలని సూచించారు. అలర్జీ, ఉబ్బసం, శ్వాసకోస, చర్మసంబంధ, మానసిక, హృద్రోగ సమస్యల బాధితులు బాణసంచా వల్ల వెలువడే పొగ, శబ్దాలకు దూరంగా ఉండాలని, ఇంట్లో పసివాళ్లను గమనిస్తూ ఉండాలని తెలిపారు. కర్టెన్లు, ఇతర మండే గుణం ఉన్న వస్తువులకు దీపాలను దూరంగా ఉంచాలన్నారు. గడ్డివాములు, గుడిసెలు, పెట్రోలు బంకుల సమీపాన, గదుల్లో, డాబా మెట్లపై, ఇరుకు ప్రదేశాల్లో బాణసంచా కాల్చడం ప్రమాదకరమని వివరించారు.
అత్యవసర సమయంలో సహాయానికి..
దీపావళి వేళ అనూహ్య రీతిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో అగ్నిమాపక శాఖ పూర్తిగా అప్రమత్తమైంది. జిల్లా ప్రజలు వారు నివసించే ప్రాంతాలు ఏ ఫైర్ స్టేషన్ పరిధిలోకి వస్తుందనే కనీస అవగాహన కలిగి ఉండాలి. అత్యవసర సమయంలో సహాయానికి 101 ఫైర్ టోల్ ఫ్రీ నంబర్ సహా ఆయా స్టేషన్ల పరిధిలో ఎమర్జెన్సీ నంబర్లను ఆ శాఖ అందుబాటులోకి తెచ్చింది. అవి ఇవే..
అగ్నిమాపక కేంద్రం ఫోన్ నంబర్లు
కాకినాడ జగన్నాథపురం 99637 26902,
0884–2374592
కాకినాడ సాలిపేట 99637 26854,
0884–2374572
తుని 99637 27294, 08854 – 253601
జగ్గంపేట 63009 65196, 08852 – 233388
పెద్దాపురం 99637 26982, 08852 – 241299
పిఠాపురం 99637 27859, 08869 – 251501
ప్రత్తిపాడు 99637 27769, 08868 – 246709
ఫైర్ ఔట్‌పోస్టుల ఏర్పాటు
కొన్ని బాణసంచా దుకాణాల సమూహాన్ని క్లస్టర్లుగా పరిగణించి ఫైర్ ఔట్‌పోస్టులు ఏర్పాటు చేశాం. రద్దీని బట్టి ప్రధాన విక్రయ కేంద్రాల వద్ద ఫైర్ ఇంజిన్లు, ప్రతి దుకాణం వద్ద ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు ఉంచాం. అగ్నిమాపక శాఖ సూచనలు పాటిస్తూ వ్యాపారులు విక్రయాలు జరపాలి. నిబంధనలు ఉల్లంఘించినా, అనుమతులు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసినాక్రిమినల్ చర్యలు తప్పవు. – ఎన్.సురేంద్ర ఆనంద్, జిల్లా అగ్నిమాపక అధికారి
అగ్నిమాపక కేంద్రం దుకాణాలు
కాకినాడ సాలిపేట 117
కాకినాడ జగన్నాథపురం 98
ప్రత్తిపాడు 50
పిఠాపురం 50
తుని 31
జగ్గంపేట 31
పెద్దాపురం 43
