
సర్పవరం జంక్షన్ వద్ద జయలక్ష్మి ఎంఏఎం సొసైటీ మెయిన్ బ్రాంచ్
● మొండి బకాయిలకు
అడ్డుపడుతున్న ‘రికార్డులు‘
● సొసైటీ బాధితుల్లో
పెరుగుతున్న ఆందోళన
కాకినాడ రూరల్: జయలక్ష్మీ సొసైటీ బాధితులు తమ డిపాజిట్ల కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నారు. కొత్త పాలక వర్గంపైనే కోటి ఆశలు పెట్టుకున్నారు. రోజులు గడుస్తున్నా పెద్దగా కదలిక లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కోట్లాది రూపాయలకు ఎగనామం పెట్టి జయలక్ష్మీ సొసైటీ గతేడాది చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. సుమారు 19,911మంది సభ్యులు కలిగిన ఈ సొసైటీ రూ.520కోట్ల వరకూ డిపాజిట్లు సేకరించింది. తర్వాత ఈ సొమ్మును ఇతర సంస్థల్లోకి చాకచక్యంగా మళ్లించింది. అధిక భాగం తమ బినామీలకే రుణాలుగా కట్టబెట్టింది. వడ్డీ చెల్లించలేని స్థితికి చేరుకున్నామని గ్రహించి గతేడాది ఏప్రిల్‌లో గుట్టు చప్పుడు కాకుండా బోర్డు తిప్పేసింది.
సిట్ ఏర్పాటు
బాధిత ఖాతాదారుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం నిలిచింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఐదుగురితో సిట్ ఏర్పాటు చేసింది. విచారణలో భారీగా అవకతవకలు బయటపడ్డాయి. సీఐడీ అధికారులు కూడా రంగంలోకి దిగి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు, డైరెక్టరుతో సహా ఏడుగురి అరెస్టు చేశారు. సిట్ నివేదిక ప్రభుత్వానికి సమర్పించాక మహాజన సభలో కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఏదీ పురోగతి
కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టి 4 నెలలు దాటినా న్యాయం జరగలేదని బాధిత ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. సొసైటీకి రూ.520కోట్లు డిపాజిట్లు ఉండగా సుమారు రూ.703కోట్ల వరకు రుణాలు ఉన్నాయి. వీటిలో రూ.123 కోట్లు మాత్రమే సెక్యూర్డ్ రుణాలు. మిగిలినవి అన్ సెక్యూర్డ్ రుణాలే. చాలా రుణాలకు డాక్యుమెంట్లు లేవు. బినామీల పేరిట కొల్లగొట్టారు. ఇలా 400 మంది అన్ సెక్యూర్డ్ రుణ గ్రహీతలను గుర్తించారు. అన్ సెక్యూర్డ్ రుణాల్లో సుమారు రూ.530 కోట్ల వరకు గత పాలవర్గ చైర్మన్, వైస్ చైర్మన్, వారి కుమారుడు దుర్వినియోగం చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఇంతవరకూ సుమారు రూ.200కోట్ల ఆస్తులను సీజ్ చేసినట్టు కొత్త పాలకవర్గం చెబుతోంది. సెక్యూర్డ్ రుణాలలో రూ.2కోట్ల వరకు రికవరీ చేశామంటోంది. సీఐడీ అధికారులు వద్ద రికార్డులు ఉండిపోవడంతో పురోగతి సాధించలేకపోతున్నట్లు తెలిసింది. మొండి బకాయిలను రికవరీ చేపట్టలేకపోవడంతో బాధితుల్లో నిరాశ పేరుకుపోతోంది.
ఎవరూ ముందుకు రావడం లేదు
మొండి బకాయిలు వసూలు అవ్వడం లేదు. చిన్న చిన్న సెక్యూర్డ్ రుణాలు తీర్చేందుకు కొందరు వస్తున్నా.. రికార్డులు సీఐడీ వద్ద ఉండిపోయాయి. అప్పు తీర్చిన వారి పత్రాలు ఇచ్చేందుకు కుదరడం లేదు. దీంతో చాలామంది ముందుకు రావడం లేదు.
– గంగిరెడ్డి త్రినాథరావు, పాలకవర్గ అధ్యక్షుడు.

